
గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణానికి చెందిన చిట్టి సంధ్య, ఆమె కొడుకు సాత్విక్ 2024 మార్చి 24న తప్పిపోగా, రెండేండ్ల తరువాత వారిని పోలీసులు గుర్తించి శనివారం కుటుంబసభ్యులకు అప్పగించారు. తల్లీకొడుకు కనిపించకుండా పోవడంతో కుటుంబసభ్యులు రామగుండం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. రామగుండం సీఐ కృష్ణకుమార్, ఎస్సై సంధ్యారాణి ఆధ్వర్యంలో సెల్ సిగ్నల్ ఆధారంగా తల్లీకొడుకు నెల్లూరులోని ఓ దర్గాలో ఉన్నట్లు గుర్తించారు. వారిని తీసుకువచ్చి ఎన్టీపీసీలోని రామగుండం సర్కిల్ ఆఫీస్లో కుటుంబసభ్యులకు అప్పగించారు.