
తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ తెలిపింది. హోంశాఖ పరిధిలోని పోలీస్, జైళ్లు, అగ్నిమాపకశాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో దాదాపు 7 వేల కొలువుల భర్తీకి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. హోంశాఖలో ఉద్యోగాల భర్తీ కోరుతూ గత కొద్దిరోజులుగా అభ్యర్థుల నుంచి వస్తున్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం వారికి పెద్ద ఊరట అని చెప్పొచ్చు. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం రెండు విడతల్లో చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే 5 వేల పోలీస్ పోస్టుల భర్తీకి అధికారిక ఉత్తర్వులు జారీ కాగా ఎస్పీఎఫ్, జైళ్లశాఖ, అగ్నిమాపక శాఖలకు సంబంధించిన మిగిలిన 2 వేల పోస్టుల కోసం ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ ప్రక్రియ అంతా కొలిక్కి వచ్చిన వెంటనే, తెలంగాణ పోలీస్ నియామక మండలి మరొకట్రెండు రోజుల్లోనే అధికారికంగా ఉద్యోగ నోటిఫికేషన్‌ను వెలువరించడానికి ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.
ఉద్యోగాలు ఇలా..
ప్రభుత్వం జీవో ప్రకారం.. 5 వేల పోలీస్ ఉద్యోగాల్లో అత్యధికంగా 3,697 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు, 1052 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు 148 సివిల్ ఎస్సై, 24 ఎస్ఏఆర్ సీపీఎల్ కానిస్టేబుల్, 23 ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై, 20 కానిస్టేబుల్ పీటీఓ, 14 ఏఆర్ ఎస్సై, 12 టీజీఎస్పీ ఏఆర్ఎస్సై, 7 కానిస్టేబుల్ పీటీఓ, 3 ఎస్ఏఆర్ సీపీఎల్ ఎస్సై పోస్టులు ఈ జాబితాలో చేరి ఉన్నాయి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత హోంశాఖలో వెలువడుతున్న నాలుగో అతిపెద్ద నోటిఫికేషన్ ఇది. గతంలో తొలిసారిగా 2015న 9,281 పోస్టులతో, ఆ తర్వాత 2018లో 1,217 ఎస్సై, 16,285 కానిస్టేబుల్ పోస్టులతో రెండో నోటిఫికేషన్ వచ్చింది. అనంతరం మూడోసారి 2022లో 554 ఎస్సై, 15,644 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయగా, ప్రస్తుతం రాబోయే 7 వేల పోస్టుల నోటిఫికేషన్ అభ్యర్థులకు మరో సువర్ణావకాశంగా మారనుంది.