Reading Time: < 1 minute
Thailand Road Accident 11 Year Old Boy Driving Pickup Truck Kills 9 Buddhist Monks Cctv Video Viral

Thailand: థాయ్‌లాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 11 ఏళ్ల బాలుడు నడిపిన పికప్ ట్రక్ బౌద్ధ సన్యాసుల పైకి దూసుకెళ్లడంతో 9 మంది సన్యాసులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయపడగా.. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటన థాయ్‌లాండ్‌లోని ఈశాన్య ప్రాంతమైన ముక్దహాన్ ప్రావిన్స్ (Mukdahan Province)లో జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 35 మంది బౌద్ధ సన్యాసులు, ఐదుగురు అనుచరులతో కూడిన బృందం పాదయాత్రలో భాగంగా ఒక ఆలయం నుంచి పొరుగు ప్రావిన్స్ అయిన ఉబోన్ రాచతాని ప్రావిన్స్ (Ubon Ratchathani Province)లోని మరో ఆలయానికి వెళ్తోంది. ఈ యాత్ర ప్రారంభమైన అరగంట తర్వాత ప్రమాదం జరిగింది.

ప్రమాద సమయంలో పికప్ ట్రక్ ఒక్కసారిగా సన్యాసుల బృందంపైకి దూసుకెళ్లింది. ఘటనాస్థలిలోనే ఐదుగురు సన్యాసులు మృతి చెందగా.. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించిన మరో నలుగురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 22 మంది సన్యాసులు, ఒక అనుచరుడు గాయపడ్డారు. వీరిలో నలుగురు సన్యాసుల పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. 11 ఏళ్ల బాలుడు తన ఇంటి వద్ద ఉన్న పికప్ ట్రక్‌ను అనుమతి లేకుండా తీసుకెళ్లాడు. సుమారు 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత సన్యాసుల బృందాన్ని ఢీకొట్టాడు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదం అనంతరం బాలుడు తీవ్ర మానసిక షాక్‌కు గురికావడంతో పోలీసులు వెంటనే విచారణ చేపట్టలేకపోయారు. బాలుడిని అదుపులోకి తీసుకుని బాలల సంక్షేమ అధికారుల పర్యవేక్షణలో విచారించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు కూడా వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటిలో సన్యాసులు రహదారి పక్కన వరుసగా నడుచుకుంటూ వెళ్తుండగా.. పికప్ ట్రక్ వేగంగా వచ్చి వారిని ఢీకొట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.