
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్పీజీ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్ టోల్ బూత్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. ఎల్‌పీజీ గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ సహా ఐదుగురు సజీవదహనమయ్యారు. పలువురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి టోల్‌ప్లాజా వద్ద జూన్ 26న ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చాయి.
24 సెకన్ల వీడియోలో.. 2 ట్యాంకర్లు టోల్ బూత్ వైపు వస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. వాటిలో కాన్పూర్ నుంచి ప్రతాప్‌గఢ్‌కు వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొడుతుంది. వెంటనే గ్యాస్ లీక్ అవ్వడంతో భారీ పేలుడు సంభవించింది. ఆ మంటలు సుమారు రెండు కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపించాయని సమాచారం. మంటలను అదుపులోకి తీసుకురావడానికి జిల్లాలోని అన్ని అగ్నిమాపక దళాల యూనిట్లతో పాటు సివిల్ పోలీసు సిబ్బందిని కూడా రంగంలోకి దించినట్టు ఒక పోలీసు అధికారి తెలిపారు.
ట్యాంకర్ డ్రైవర్ ధర్మేంద్ర దుబే(40), టోల్ ప్లాజా ఉద్యోగి అలోక్ సింగ్ అక్కడికక్కడే మరణించారు. టోల్ ప్లాజాకు చెందిన పలువురు ఉద్యోగులు గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. వారిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనిల్ కుమార్ ఈ నెల 1న ట్రీట్మెంట్ పొందుతూ మరణించాడు. రాయ్‌బరేలీకి చెందిన హిరమణి సింగ్, మధ్యప్రదేశ్‌కు చెందిన కృష్ణ పాల్ మౌర్య 2వ తేదీన మరణించారు. టోల్ ప్లాజా సమీపంలో నిలిపి ఉంచిన పదహారు మోటార్‌సైకిళ్లు, రెండు కార్లు కూడా మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయాయి.