
పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఆడంబరాలకు, సంపదకు ప్రసిద్ధి చెందిన దుబాయ్‌లో, ఒంటెల రేసింగ్ ఒక మల్టీ బిలియన్ డాలర్ల పరిశ్రమగా విరాజిల్లుతోంది. చమురు సంపద, పెట్టుబడిదారీ విధానంపై నిర్మితమైన ఈ ప్రాంతంలో, క్యామెల్ రేసింగ్‌లో గెలుపు అనేది షేక్‌లకు అధికారాన్ని, ప్రతిష్టను తెచ్చిపెట్టే ముఖ్యమైన అంశం. అయితే, ఈ రేసింగ్ వెనుక అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘన, పిల్లల అమానవీయ దోపిడీ అనే చీకటి వాస్తవం దాగి ఉంది.
బంగ్లాదేశ్, పాకిస్తాన్, సుడాన్, ఇండియా వంటి పేద దేశాల నుండి రెండేళ్ల వయస్సున్న చిన్న పిల్లలను అక్రమంగా యూఏఈకి రవాణా చేసి, ఒంటె జాకీలుగా బలవంతంగా పెట్టేవారు. ఒంటె వేగంగా పరుగెత్తడానికి జాకీ బరువు తక్కువగా ఉండాలనే ఆలోచనతో చిన్నారులను ఈ ప్రమాదకరమైన క్రీడలోకి దింపేవారు. “జాకీ ఎంత చిన్నగా ఉంటే, ఒంటె అంత వేగంగా పరుగెడుతుంది” అనే సూత్రాన్ని అనుసరించి, ఈ పిల్లలు తమ కుటుంబాలకు, తమ దేశాలకు వేల మైళ్ళ దూరంలో, అపరిచిత వాతావరణంలో బానిసత్వంలో బతికేవారు. కింద పడితే తీవ్రమైన గాయాలు లేదా మరణం సంభవించే అవకాశం ఉన్న ఈ క్రీడలో చిన్నారుల ప్రాణాలు గాల్లో దీపం లాంటివే.
అంతర్జాతీయ సమాజం నుండి వచ్చిన విమర్శల నేపథ్యంలో యూఏఈ 1993లో 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న జాకీలను నియమించడాన్ని నిషేధించింది. 2002 సెప్టెంబర్‌లో అధిక జరిమానాలతో ఈ నిషేధాన్ని మరింత బలోపేతం చేసినట్లు ప్రకటించింది. యూఏఈ ఒంటెల పందాల సమాఖ్య అధిపతి ఖల్ఫాన్ ఖమీస్ వంటి అధికారులు, పిల్లల జాకీలు అసలు లేనేలేరని, చట్టం కచ్చితంగా అమలు చేయబడుతోందని పదేపదే ప్రకటించారు. అయితే జర్నలిస్టులు చేసిన పరిశోధనలు ఈ వాదనలకు భిన్నమైన వాస్తవాలను వెల్లడిస్తున్నాయి. ఒక సందర్భంలో ఒక ప్రభుత్వ అధికారి జర్నలిస్టులను ఒక రేసింగ్ చిత్రీకరించడానికి తీసుకెళ్లినప్పుడు, తప్పుగా ఏర్పాటు చేయడం వల్ల, పసిపిల్లల వయస్సు దాటని అనేక మంది
చిన్న పిల్లలు జాకీలుగా ఉన్న రేసింగ్‌ను వారు చూడాల్సి వచ్చింది. పోలీసులు వెంటనే పిల్లలను తొలగించడానికి ప్రయత్నించినా, జర్నలిస్టులు వారి చిత్రాలను తీశారు. 15 ఏళ్లలోపు పిల్లలను రేసింగ్‌లోకి అనుమతించకూడదని అధికారులు వాదించినప్పటికీ, వారి ఉనికి స్పష్టంగా దోపిడీని ఎత్తిచూపింది. పిల్లల చిత్రాలను అప్పగించాలని డిమాండ్ చేయడంతో, అధికారులు ఈ అక్రమ కార్యకలాపాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని అర్థమవుతోంది.
మరో విషాదకర విషయం ఏంటంటే.. ఈ రేసింగ్‌లో పాల్గొనే ఒంటెలకు లభించే రాజభోగాలు, పిల్లల దుర్భర పరిస్థితులకు విరుద్ధంగా ఉన్నాయి. మిలియన్ డాలర్ల విలువ చేసే ఒంటెలను సొంత స్విమ్మింగ్ పూల్స్‌లో స్నానం చేయిస్తారు. వాటికి అత్యుత్తమ వైద్య సంరక్షణ, పోషణ లభిస్తాయి. కానీ, ఈ రేసింగ్‌లో జాకీలుగా పాల్గొనే పిల్లలకు కనీస సౌకర్యాలు కూడా ఉండవు. అప్పట్లో రహస్యంగా చిత్రీకరించిన దృశ్యాలలో ఐదు, ఏడేళ్ల పాకిస్తానీ పిల్లలు శిథిలావస్థలో ఉన్న గుడిసెలలో నేల మీద నిద్రిస్తున్నట్లు కనిపించారు. ఒంటె జాకీలు పందెం ఓడిపోతే పిల్లల్ని కొరడాలతో కొట్టడం, వారికి ఆహారం ఇవ్వకపోవడం వంటివి చేసేవారు. అయితే అంతర్జాతీయంగా మానవ హక్కుల కార్యకర్తల ఒత్తిడితో 2002 నుండి మానవ జాకీలను పూర్తిగా నిషేధించారు. దానికి బదులుగా ఒంటెల వీపులకు కట్టి ఉంచిన రిమోట్-కంట్రోల్డ్ రోబోట్ జాకీల ద్వారా వాటిని నడిపిస్తూ ఈ రేసింగ్ కొనసాగిస్తున్నారు.

