
Saikrishna Case: విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ కేసులో మెజిస్ట్రియల్ విచారణ ముగిసింది. ఈ సందర్భంగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, మేనమామ, జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ప్రతినిధులు, వైసీపీ బృందం నుంచి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) వివరాలు సేకరించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన విజయలక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసుకు సంబంధించిన అన్ని విషయాలను అధికారులు అడిగి తెలుసుకున్నారని చెప్పారు. అయితే తన కొడుకు బూడిదను తనకు అప్పగించాలని డిమాండ్ చేశారు. బూడిద ఇవ్వకపోతే నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతికి పాల్పడతానని హెచ్చరించారు.
“నా కొడుకుని ఎందుకు చంపారు? ఈ ఘటనలో ఎవరు ప్రమేయం ఉన్నా వారందరినీ కఠినంగా శిక్షించాలి. ఇప్పటివరకు నలుగురు, ఐదుగురినే అరెస్ట్ చేశారు. మిగిలిన వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?” అని ఆమె ప్రశ్నించారు విజయలక్ష్మి.. అలాగే, తన ఇంటికి వచ్చి తన కుమారుడిని తీసుకెళ్లిన వారిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. “ఈ కేసులో ఉన్నవాళ్లందరూ నాకు తెలుసు. ఒక్కరినీ వదిలిపెట్టొద్దు” అని ఆమె అన్నారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న బూడిద నిజంగా తన కుమారుడిదేనని ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించిన విజయలక్ష్మి, పూర్తి స్థాయిలో నిష్పాక్షిక దర్యాప్తు జరిపి తన కుమారుడి మరణానికి బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి..