Reading Time: 2 minutes
NTR: అన్న ఎన్టీఆర్‌కు ‘విశ్వవిఖ్యాత నటసార్వభౌమ’ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా..?

ఎన్టీఆర్ భారతీయ సినిమా చరిత్రలో ఒక అగ్ర నటుడు. ఆయన పోషించిన అనేక పాత్రల వల్ల ఆయనకు పేరు ప్రఖ్యాతులు లభించాయి. అదే సమయంలో, ఆయన నటించడం వల్ల కొన్ని పాత్రలకు అమితమైన గుర్తింపు దక్కింది. రాముడు, కృష్ణుడు, భీముడు, భీష్ముడు, కర్ణుడు, దుర్యోధనుడు, అర్జునుడు వంటి పౌరాణిక పాత్రలు పోషించినప్పుడు ఆ పురాణ పురుషులందరూ ఎన్టీఆర్‌లోకి పరకాయ ప్రవేశం చేశారని చెప్పాలి. ఆయన రూపంలో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కృష్ణుడు ఇలా, రాముడు అలా ఉండేవాడు కాబోలు అని జనాన్ని మురిపించి, ఆనందపారవశ్యంతో మైమరచిపోయే విధంగా ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలు విశ్వవిఖ్యాతమయ్యాయి. అందుకే ఆయనను విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అని పిలుచుకున్నారు. ఈ అపురూపమైన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అనే బిరుదు ఎన్టీఆర్‌కు ఎలా వచ్చిందో, ఎవరు ఇచ్చారో తెలుసుకోవడం ఆసక్తికరం.

1963 ఆరంభంలో జరిగిన ఒక దైవిక సంఘటనతో ఈ బిరుదు ఆయన జీవితంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో ఎన్టీఆర్ నటించిన నర్తనశాల చిత్రం విడుదలై విజయవిహారం చేస్తోంది. ఆ సినిమాలో ఎన్టీఆర్ పోషించిన బృహన్నల పాత్రకు అద్భుతమైన స్పందన వచ్చింది. అరివీర భయంకరుడైన అర్జునుడిగా, శాపవశాత్తూ అర్ధనారిగా మారిన బృహన్నలగా ఎన్టీఆర్ ప్రదర్శించిన నటన అసామాన్యమైనది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఒకరోజు గుంతకల్లుకు వెళ్లారు. సినిమా పంపిణీ రంగానికి కోస్తా ఆంధ్రలో విజయవాడ, నైజాంలో సికింద్రాబాద్ ఎలాగో, ఆ రోజుల్లో సీడెడ్‌లో గుంతకల్లు కూడా అలాగే ముఖ్యమైన కేంద్రం. సీడెడ్ అంటే రాయలసీమ జిల్లాలు. ఎన్టీఆర్ నటుడే కాదు, నిర్మాత కూడా. ఆయన సినిమాల పంపిణీ వ్యవహారాలను అట్లూరి బలరాం చూసుకునేవారు. నిర్మాత పుండరీకాక్షయ్యకు సొంత తమ్ముడే బలరాం. ఎన్టీఆర్‌కు పుండరీకాక్షయ్య దగ్గరి బంధువు, అత్యంత సన్నిహితుడు. గుంతకల్లు పర్యటనలో పనులన్నీ పూర్తయ్యాక, తిరుగు ప్రయాణానికి ముందు సమీపంలో ఉన్న శ్రీశైలం జగద్గురువు శంకరాచార్య ఆశ్రమాన్ని దర్శించుకోవాలని అట్లూరి సోదరులు సూచించారు. ఎన్టీఆర్ అంగీకరించడంతో వెంటనే ఆశ్రమానికి బయలుదేరారు. ఆశ్రమంలోకి గంభీరంగా నడిచివస్తున్న ఎన్టీఆర్‌ను తదేకంగా చూస్తూ, పీఠాధిపతి సాధరంగా ఆహ్వానించారు. “రండి, ఆశీనులు కండి. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామ” అని స్వామీజీ ఆసువుగా, అన్యాపదేశంగా సంబోధించారు. శంకరాచార్య అలా పిలవడం చూసి అట్లూరి సోదరులు ఆశ్చర్యపోయారు. ఎన్టీఆర్ వినమ్రంగా స్వామివారికి నమస్కరించారు. ఆ తర్వాత కొంతసేపు పిచ్చాపాటీ సంభాషణ జరిగింది. ఎన్టీఆర్ స్వామివారి దగ్గర సెలవు తీసుకుని వెనుదిరిగారు. ఆ సంఘటనను ఆయన అక్కడితో మరిచిపోయినా, పుండరీకాక్షయ్య మాత్రం మర్చిపోలేదు. ఈ సంఘటన జరిగిన కొంతకాలానికి పుండరీకాక్షయ్య నిర్మించిన ఆరాధన చిత్రం విడుదలైంది. ఆ సినిమా టైటిల్స్‌లో ఎన్టీఆర్ పేరుకు ముందు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ బిరుదు వేయాలని పుండరీకాక్షయ్య అనుకున్నారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్‌కు చెప్పినప్పుడు, ఆయన “వద్దు, ప్రజల సమక్షంలో లభించిన బిరుదు కాదు. మనమే సొంతంగా తగిలించుకున్నామని అవహేళన చేస్తారు” అని నిరాకరించారు. ఆయన మొహమాటం గమనించి, పుండరీకాక్షయ్య “ఇది భగవత్ సంకల్పంగా వచ్చిన బిరుదు. శంకరాచార్య స్వయంగా మెచ్చి ఇచ్చిన బిరుదు కంటే గొప్ప గౌరవం మరేమి ఉంటుంది?” అని వాదించారు. పుండరీకాక్షయ్య మాటలకు ఎన్టీఆర్ మెత్తబడ్డారు. అలా ఆయన ఆరాధన చిత్రంతో అధికారికంగా విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అయ్యారు. పదవులు, బిరుదులు, గౌరవాలు కోరుకుంటే రావు, అవి వ్యక్తిని వెతుక్కుంటూ రావాలి అనడానికి ఎన్టీఆర్ జీవితమే నిదర్శనం.

(ఈ సమాచారం వెటరన్ ఫిల్మ్ జర్నలిస్టుల నుంచి సేకరించాం)

ఎన్టీవోడే దేవుడు, రాముడు అనే రోజుల్లో.. శోభన్ బాబుతో సాహసం.. సినిమా ఫలితం ఏంటంటే..