
- పేషెంట్ ఫాలోఅప్ రిపోర్టులను బయటపెట్టని కార్పొరేట్ హాస్పిటల్స్
- రూల్స్ ప్రకారం.. ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత ఐదుసార్లు రిపోర్టు ఇవ్వాలి
- బ్రాండ్ ఇమేజ్ తగ్గి.. ఆదాయానికి గండి పడుతుందనే దాచివేత
- సక్సెస్ రేటు తక్కువుంటే.. ట్రాన్స్‌ప్లాంట్ పర్మిషన్లు రద్దు చేసే చాన్స్
హైదరాబాద్, వెలుగు: మరణ శయ్యపై ఉన్న పేషెంట్లకు పునర్జన్మ ప్రసాదించే అవయవ మార్పిడి ప్రక్రియపై కార్పొరేట్ హాస్పిటళ్లు గోప్యత పాటిస్తున్నాయి. రూల్స్ ప్రకారం ప్రభుత్వానికి సమర్పించాల్సిన డేటాను దాచేస్తున్నాయి. ఒక వ్యక్తికి ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినప్పుడు గొప్పగా ప్రచారం చేసుకునే హాస్పిటల్స్, ఆ తర్వాత సదరు పేషంట్ ఆరోగ్య పరిస్థితిపై నివేదికలు ఇవ్వడంలో మాత్రం మొండికేస్తున్నాయి.
ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్(తోటా) నిబంధనల ప్రకారం.. ట్రాన్స్‌ప్లాంట్ జరిగిన తర్వాత పేషంట్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, ఆ డేటాను స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (సోటో)కు సమర్పించాలి. కానీ, హైదరాబాద్‌లోని కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఈ రూల్స్‌ను బేఖాతర్ చేస్తున్నాయి. కేవలం తమ వ్యాపార ప్రయోజనాలు, బ్రాండ్ వ్యాల్యూ కాపాడుకోవడం కోసం ఈ కీలక సమాచారాన్ని తొక్కిపెడుతున్నాయి.
ఐదేండ్ల పాటు రిపోర్టులివ్వాలి
నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేషన్ (ఎన్ఓటీటీఓ) రూల్స్ ప్రకారం.. అవయవ మార్పిడికి ముందు, తరువాత హాస్పిటల్స్ కొన్ని రూల్స్ ఫాలో కావాలి. ట్రాన్స్‌ప్లాంటేషన్ ముందు తతంగం అంతా బానే జరుగుతున్నా.. సర్జరీ తరువాత సమాచారాన్ని ఇవ్వడానికి హాస్పిటల్స్ నిరాకరిస్తున్నాయి. ఒక పేషంట్‌కు సర్జరీ పూర్తయిన తర్వాత నెల రోజులకు, ఆరు నెలలకు, ఏడాదికి, 3 ఏండ్లకు, 5 ఏండ్లకు ఆ వ్యక్తి ఆరోగ్యం ఎలా ఉందనే ‘ఫాలోఅప్’ రిపోర్టులను ‘సోటో’కు సమర్పించాలి.
ఆ పేషంట్‌కు అమర్చిన అవయవం పనిచేస్తున్నదా? ఇన్ఫెక్షన్ సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారా? లేక ట్రాన్స్‌ప్లాంట్ వికటించి చనిపోయారా? అనే వివరాలను రిజిస్ట్రీలో నమోదు చేయాలి. అలాగే, హాస్పిటల్స్ తమ ట్రాన్స్‌ప్లాంట్ సక్సెస్ అండ్ సర్వైవల్ రేట్లను బహిరంగంగా తమ అధికారిక వెబ్‌సైట్‌లో, హాస్పిటల్‌లో ప్రదర్శించాలి. కానీ, హైదరాబాద్‌లోని మెజారిటీ కార్పొరేట్ హాస్పిటల్స్ ఈ డేటాను దాచిపెడుతున్నాయి. వందల్లో ట్రాన్స్‌ప్లాంట్లు చేశామని ప్రచారం చేసుకుంటున్న మేనేజ్‌మెంట్లు, అందులో ఎంతమందికి సక్సెస్‌ఫుల్‌గా సర్జరీలు చేశారనే విషయాన్ని మాత్రం బయటపెట్టడం లేదు.
ఆదాయానికి గండి పడుతుందని..
హాస్పిటల్స్ ఈ డేటాను దాచడం వెనుక పెద్ద కుట్రే ఉన్నట్లు వైద్య నిపుణులు ఆరోపిస్తున్నారు. రూల్స్ ప్రకారం.. ఏదైనా హాస్పిటల్‌లో అవయవ మార్పిడి ఫెయిల్యూర్ రేటు ఎక్కువగా ఉంటే, ప్రభుత్వం ఆ హాస్పిటల్‌కు ఉన్న ట్రాన్స్ ప్లాంట్ అనుమతులను రద్దు చేసే అవకాశం ఉంది. అందుకే, తమ వద్ద జరిగిన ఫెయిల్యూర్లను కప్పిపుచ్చుకోవడానికి మేనేజ్‌మెంట్లు ప్రయత్నిస్తున్నాయి.
ఒకవేళ ఆపరేషన్ విఫలమై పేషంట్ చనిపోయినట్లు రికార్డుల్లోకి ఎక్కితే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని భయపడుతున్నాయి. ట్రాన్స్‌ప్లాంట్ సక్సెస్ రేటు తక్కువగా ఉంటే.. హాస్పిటల్ ర్యాంకింగ్ కూడా పడిపోతుంది. దీంతో పేషంట్ల సంఖ్య తగ్గి, ఆదాయంపై భారీగా ఎఫెక్ట్ పడుతుంది. అందుకే.. కేవలం సక్సెస్ అయిన ఆపరేషన్లనే హైలైట్ చేస్తూ, ఫెయిల్ అయిన పేషెంట్ల వివరాలను ప్రభుత్వానికి అందించడం లేదు.
సక్సెస్ రేటుపై సస్పెన్స్..
హైదరాబాద్ నగరం ప్రపంచ మెడికల్ హబ్‌గా మారుతున్నది. అనేక దేశాల నుంచి వైద్యం కోసం మన వద్దకు వస్తున్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్‌లో వందల్లో ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు జరుగుతున్నాయి. అయితే, ఏ హాస్పిటల్‌లో ఎంత సక్సెస్ రేటు ఉందో తెలిస్తేనే.. స్టేట్ యావరేజ్ సక్సెస్ రేటు లెక్కించడానికి వీలుంటుంది. బడా హాస్పిటల్స్ డేటా ఇవ్వకపోవడంతో వందల ట్రాన్స్‌ప్లాంట్లు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నా, అందులో ఎన్ని సక్సెస్ అవుతున్నాయని చెప్పడానికి లెక్కలు కరువవుతున్నాయి.
మరోవైపు ఈ డేటా ఇవ్వకపోవడం వల్ల పేషంట్లకు కూడా నష్టం పొంచివున్నది. డేటా మానిటరింగ్ లేకపోతే, ‘ఇమ్యునోసప్రెసెంట్’ మందుల డోసేజ్ తారుమారై ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. ఒకవేళ మొదటి ట్రాన్స్‌ప్లాంట్ విఫలమై, రోగికి మళ్లీ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ అవసరమైతే, పాత ఫాలో-అప్ డేటా సరిగ్గా లేకపోతే నేషనల్ వెయిటింగ్ లిస్టులో ప్రాధాన్యత దక్కడం కూడా కష్టమవుతుంది.
ఆదేశాలు సైతం బేఖాతరు..
సిటీలోని కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఫాలోఅప్ డేటా ఇవ్వకపోవడంతో రిసీవర్ల పూర్తి హెల్త్ డేటాను పంపాలంటూ సోటో (జీవన్ దాన్) నోడల్ ఆఫీసర్ కొంతకాలంగా పలుమార్లు లెటర్లు రాశారు. అయినా, హాస్పిటళ్ల యాజమాన్యాల నుంచి స్పందన కరువైంది. నోడల్ ఆఫీసర్ ఆదేశాలను సైతం ఈ హాస్పిటల్స్ బేఖాతరు చేస్తున్నాయి.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, కార్పొరేట్ హాస్పిటల్ ట్రాన్స్‌ప్లాంట్ దందాపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు కోరుతున్నారు. డేటా దాస్తున్న హాస్పిటళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.