Reading Time: 1 minute
ఈడీ చరిత్రలో సంచలనం.. రూ.792 కోట్ల మోసం కేసులో తొలిసారి ప్రైవేట్ జెట్ వేలం!

హైదరాబాద్ కేంద్రంగా జరిగిన రూ.792 కోట్ల ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ మోసం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న హాకర్ 800ఏ ప్రైవేట్ జెట్‌ను తొలిసారిగా వేలం వేసి విక్రయించింది. ఇది ఈడీ చరిత్రలోనే మొదటి ఘటనగా నిలిచింది. ఈ వేలం ద్వారా సుమారు రూ.3 కోట్లు సమీకరించినట్లు అధికారులు వెల్లడించారు.

ఫాల్కన్ గ్రూప్ పేరుతో కార్యకలాపాలు నిర్వహించిన క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై నమోదైన మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈ ప్రైవేట్ జెట్‌ను ఈడీ స్వాధీనం చేసుకుంది. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన మూడు ఆర్థిక నేరాల కేసుల ఆధారంగా ప్రారంభమైన దర్యాప్తు అనంతరం ఈ కేసు వెలుగులోకి వచ్చింది. పెట్టుబడిదారులకు అధిక లాభాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో సుమారు రూ.792 కోట్లను సేకరించినట్లు దర్యాప్తులో తేలింది.

అయితే, అసలు ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ వ్యాపారం నిర్వహించకుండా తప్పుడు హామీలతో ప్రజల నుంచి నిధులు సేకరించినట్లు ఈడీ ఆరోపిస్తోంది. సేకరించిన డబ్బును వ్యక్తిగత ఆస్తుల కొనుగోలు, బినామీ పెట్టుబడులు తదితర అవసరాలకు మళ్లించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ కేసులో కంపెనీ ఛైర్మన్ అమర్‌దీప్ కుమార్ సోదరుడు సందీప్ కుమార్, చార్టర్డ్ అకౌంటెంట్ శరద్ చంద్ర తోష్ణివాల్, ఫాల్కన్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ సీఈఓ ఆర్యన్ సింగ్ ఛాబ్రా సహా పలువురిని ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది. 2025 సెప్టెంబరులో ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లైంట్ కూడా దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు.

2025 మార్చి 7న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన సోదాల్లో హాకర్ 800ఏ జెట్‌ను స్వాధీనం చేసుకున్న ఈడీ, అనంతరం ఆగస్టులో అడ్జుడికేటింగ్ అథారిటీ ఆమోదం పొందింది. నవంబరులో విక్రయానికి అనుమతి రావడంతో ఎంఎస్‌టీసీ ఈ-వేలం వేదిక ద్వారా 2026 జూలై 1న విమానాన్ని విక్రయించారు. ఈ ప్రక్రియ ద్వారా వచ్చిన రూ.3 కోట్లను ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు అనుమతితో నిజమైన పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించే ప్రక్రియలో వినియోగించనున్నట్లు ఈడీ వెల్లడించింది.

ఇక కేసులో అక్రమంగా సంపాదించిన ఇతర ఆస్తులను గుర్తించే దిశగా దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. మనీలాండరింగ్ నెట్‌వర్క్‌ను పూర్తిగా బయటపెట్టేందుకు మరిన్ని ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..