Reading Time: < 1 minute

రామ మందిర విరాళాల చోరీ ఘటన భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసింది

Caption of Image.

దోషులను కఠినంగా శిక్షించాలి: ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే

న్యూఢిల్లీ: అయోధ్యలోని రామ మందిర విరాళాల చోరీ ఘటన కోట్లాది మంది రామ భక్తుల విశ్వాసాన్ని, హిందూ సమాజ భావోద్వేగాలను దెబ్బతీసిందని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే అన్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తొలిసారిగా స్పందించింది. హోసబలే శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా ప్రకటన విడుదల చేశారు. సిట్‌ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను ఆలయ ట్రస్ట్ అత్యంత అసాధారణమైన, ఖండించదగ్గ సంఘటనగా పరిగణించి ఆలయ పరిపాలన, ఆర్థిక నిర్వహణ, భద్రతా వ్యవస్థల్లో ఉన్న అన్ని లోపాలను వెంటనే సరిదిద్దాలని కోరారు. 

ప్రస్తుతం నెలకొన్న గందరగోళం, అనిశ్చిత పరిస్థితులకు త్వరగా ముగింపు పలకాలని హోసబలే అన్నారు. అలాగే, ఈ ఘటనను ఆసరాగా చేసుకుని హిందూ ధర్మాన్ని అపఖ్యాతిపాలు చేసేందుకు హిందూ, దేశ వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తున్నాయని హోసబలే ఆరోపించారు. 

ఇలాంటి కుట్రలను తిప్పికొట్టేందుకు హిందూ సమాజం సహనం, సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. కోట్లాది మంది భక్తుల త్యాగాల ఫలితంగా నిర్మితమైన శ్రీరామ జన్మభూమి ఆలయం ప్రపంచవ్యాప్తంగా హిందువుల విశ్వాసానికి కేంద్రబిందువుగా నిలిచిందన్నారు.

©️ VIL Media Pvt Ltd.