
టెలిగ్రామ్ యాప్.. బోలెడు సినిమాలు.. కొత్త సినిమా ఏదైనా సరే.. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు పైరసీ సినిమాలు వచ్చేస్తాయి.. అంతేనా OTT కంటెంట్ ఫ్రీగా ఉంటుంది. పైరసీ గాళ్లకు టెలిగ్రామ్ లింక్ అనేది కామన్ అయిపోయింది. ఇక సోషల్ మీడియాలో అయితే టెలిగ్రామ్ లింక్ ద్వారానే సినిమాలు, OTT వెబ్ సిరీస్ కంటెంట్ వచ్చేస్తోంది. దీనిపై ఇప్పటికే కంప్లయింట్స్ ఉన్నాయి.
ఈ క్రమంలోనే టెలిగ్రామ్ యాప్ పై కేంద్రం సీరియస్ అయ్యింది. టెలిగ్రామ్ యాప్ లో వైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్ పై తక్షణ చర్యలు తీసుకోవాలని.. ఇలాంటి కంటెంట్ తొలగింపు కోసం ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.. ఏం చేయబోతున్నారు అనేది 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసిాంది.
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్ మాత్రమే కాకుండా కేంద్ర సమాచారం మంత్రిత్వ శాఖకు సంబంధించిన నిబంధనలకు విరుద్ధంగా.. న్యూస్ ఛానెల్స్ గ్రూపులు క్రియేట్ చేయటం, బాట్ లు ఉపయోగించటం, అకౌంట్స్ ఓపెన్ చేయటం వంటి వాటిపైనా చర్యలు తీసుకోవాలని నోటీసుల్లో స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.
టెలిగ్రామ్ యాప్ లో ఆన్ లైన్ పైరసీ వల్ల సినిమా పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని.. కంటెంట్ క్రియేటర్ల వ్యవస్థ దెబ్బతింటుందని.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కు నష్టం వస్తుందని.. డిస్ట్రిబ్యూటర్లు, యాడ్ ఏజెన్సీల మనుగడ ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది కేంద్రం. వీళ్లందరి పరిరక్షణ కోసం టెలిగ్రామ్ లో వెంటనే పైరసీ కంటెంట్ తొలగింపునకు సంబంధించి విధివిధానాలను 15 రోజుల్లో నివేదిక రూపంలో ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది కేంద్రం.
టెలిగ్రామ్ యాప్ లో పైరసీ సినిమాలు, పైరసీ ఓటీటీ కంటెంట్ ఉన్న 3 వేల ఛానెల్స్ ను ఇప్పటికే గుర్తించామని.. ఆయా ఛానెల్స్ ను వెంటనే యాప్ నుంచి తొలగించటంతోపాటు భవిష్యత్ మళ్లీ రాకుండా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం టెలిగ్రామ్ పైనే ఉందని హెచ్చరించింది కేంద్రం.
లీక్ అయిన నీట్ పేపర్ టెలిగ్రామ్ ద్వారా వ్యాప్తి జరిగిందని గుర్తించిన కేంద్రం.. నీట్ రీ ఎగ్జామ్ సందర్భంగా వారం రోజులు నిషేధం విధించింది. ఆ తర్వాత యధావిధిగా పని చేస్తుంది. ఇప్పుడు ఆన్ లైన్ పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్ పై దృష్టి పెట్టిన కేంద్రం.. టెలిగ్రామ్ యాప్ కు సీరియస్ నోటీసులు జారీ చేసింది. ఈ 15 రోజుల్లో టెలిగ్రామ్ నుంచి వచ్చే సమాధానం ఏంటీ.. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నది అనేది ఆసక్తిగా మారుతుంది.