
Centre Orders Google, Apple: ఈ-రిక్షాలు, ఇతర ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాల బ్యాటరీలను రిమోట్‌గా నిలిపివేసే సామర్థ్యం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడు మొబైల్ యాప్‌లను వెంటనే తొలగించాలని గూగుల్, యాపిల్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికుల భద్రత, వాహనాల నిర్వహణలో అంతరాయం, బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లకు అనధికారిక ప్రాప్యత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఈ యాప్‌లను తొలగించాలని నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. గుర్తించిన యాప్‌లలో BAT-BMS, SMART BMS, LOSSIGY వంటి యాప్‌లు ఉన్నాయి. ఈ యాప్‌ల ద్వారా బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లలో అనధికారికంగా జోక్యం చేసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఇటీవల ఢిల్లీలో సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొందరు వ్యక్తులు BAT-BMS వంటి యాప్‌లను ఉపయోగించి ప్రయాణంలో ఉన్న ఈ-రిక్షాల బ్యాటరీలను రిమోట్‌గా ఆఫ్ చేస్తున్నట్లు వీడియోల్లో కనిపించింది. దీంతో మధ్య రోడ్డులోనే వాహనాలు ఒక్కసారిగా ఆగిపోవడం, ప్రయాణికులు, డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. కొన్ని సందర్భాల్లో డ్రైవర్లు తమ ఈ-రిక్షాలను నెట్టుకుంటూ సర్వీస్ సెంటర్లకు తీసుకెళ్లాల్సి వచ్చినట్లు సమాచారం.
వాస్తవానికి ఈ యాప్‌లను బ్యాటరీ ఆరోగ్యం, ఛార్జింగ్ స్థితి, ఇతర సాంకేతిక వివరాలను పర్యవేక్షించేందుకు తయారు చేశారు. అయితే కొన్ని బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లలో ఉన్న భద్రతా లోపాలను ఉపయోగించుకుని బ్లూటూత్ ద్వారా సరైన అనుమతి లేకుండానే బ్యాటరీలకు కనెక్ట్ అయి “Discharge Off” ఫంక్షన్‌ను యాక్టివేట్ చేసి వాహనాన్ని నిలిపివేస్తున్నట్లు దర్యాప్తులో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ ఘటనలపై ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే విచారణ ప్రారంభించింది. ఈ సాంకేతికతను దుర్వినియోగం చేయడం చట్టవిరుద్ధమని ఢిల్లీ రవాణా శాఖ మంత్రి పంకజ్ సింగ్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పోలీసుల ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముందని తెలిపారు. అలాగే ఇలాంటి భద్రతా లోపాలు ఇతర బ్యాటరీ మేనేజ్‌మెంట్ యాప్‌లు, వ్యవస్థల్లో కూడా ఉన్నాయా అనే అంశంపై అధికారులు పరిశీలిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలక్ట్రిక్ వాహనాల కోసం మరింత కఠినమైన సైబర్ భద్రతా ప్రమాణాలను అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.