
లక్నో: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోన్న అయోధ్య రామ మందిర విరాళాల గోల్ మాల్, నిధుల దుర్వినియోగం కేసులో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు ఆలయం నుంచి దొంగిలించిన బంగారు ఆభరణాలను కరిగించి.. కరిగించిన బంగారాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా బిస్కెట్ల రూపంలోకి మార్చినట్లు సిట్ అనుమానిస్తోందని నేషనల్ మీడియా ఛానెల్ ఇండియా టూడే కథనాన్ని ప్రచురించింది.
కాగా, కేసు దర్యాప్తులో భాగంగా అయోధ్య రాములోరికి వచ్చిన ఆభరణాలు, ఇతర విలువైన కానుకల డేటా, వాటి నిర్వహణ గురించి ఆలయ ఇన్‌చార్జ్ కేడీ బాబును సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆభరణాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగిననట్లు గుర్తించిన సిట్.. ఆలయం నుంచి దొంగలించిన బంగారాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా నిందితులు బిస్కెట్ల రూపంలోకి మార్చినట్లు అధికారులు అమానిస్తున్నారు. దీంతో ఈ కోణంలో సిట్ కేసు దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది.
అయోధ్య వివాదం ఏంటంటే..?
అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం, ట్రస్ట్ నిధుల్లో గోల్ మాల్ జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. రామ మందిర ప్రాంగణంలోని విరాళాల పెట్టెల నుంచి డబ్బు మాయమైందని ప్రతిపక్ష సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించాయి. ఈ ఘటనపై విచారణ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
మరోవైపు.. ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంగా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవడానికి.. వాస్తవాలను నిర్ధారించుకోవడానికి విచారణకు ఆదేశించాలని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కూడా ప్రభుత్వాన్ని కోరింది. ప్రతిపక్షాల డిమాండ్, ట్రస్ట్ అభ్యర్థన మేరకు రామ మందిర విరాళాల వివాదంపై యోగి సర్కార్ సిట్ విచారణకు ఆదేశించింది.
ఈ మేరకు లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కిరణ్ ఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ ముగ్గురు సభ్యులతో కూడిన సిట్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వివాదంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, నివేదిక సమర్పించాలని ప్రభుత్వం సిట్ను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కేసును సీరియస్గా తీసుకున్న సిట్.. అయోధ్యలోని రామ మందిర ట్రస్ట్కు సంబంధించిన విరాళాలు, ఆర్థిక నిర్వహణపై లోతుగా విచారణ చేపట్టింది.
ఇందులో భాగంగా ఆలయ విరాళాల లెక్కింపుతో సంబంధం ఉన్న పలువురు ఉద్యోగులు, సిబ్బందిని సిట్ విచారించింది. ఆరు రోజుల పాటు పలువురిని ప్రశ్నించింది. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు ఇతర సాంకేతిక, భౌతిక సాక్ష్యాలను పరిశీలించింది. ఆరు రోజుల విచారణ అనంతరం కేసుకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను సీఎంకు అందజేసింది సిట్. నిధుల గోల్ మాల్ వ్యవహారంలో 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.