
బీహార్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజు కుమార్ సింగ్‌కు ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. మహిళా వైద్యురాలిని చంపిన కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. 2018 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జరిగిన సెలబ్రేటరీ ఫైరింగ్‌లో మహిళా వైద్యురాలు డాక్టర్ అర్చనా గుప్తా మృతి చెందిన కేసులో దోషిగా తేల్చిన కోర్టు.. నాలుగేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు ఆయుధ చట్టం ఉల్లంఘన కేసులో మరో రెండు నెలల జైలు శిక్ష విధించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గొగ్నే ఈ తీర్పు వెలువరించారు. భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 304 పార్ట్-II కింద హత్యకు సమానంకాని నేరపూరిత మానవ వధ నేరానికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించారు. అలాగే లైసెన్సు నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయుధ చట్టం కింద మరో రెండు నెలల జైలు శిక్ష ఖరారు చేశారు. శిక్షతో పాటు బాధితురాలి భర్తకు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. నిర్ణీత సమయంలో పరిహారం చెల్లించకపోతే అదనంగా మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
2018 డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి 2019 జనవరి 1 ఉదయం వరకు ఢిల్లీలోని ఫతేపూర్ బేరీ ప్రాంతంలోని ఓ ఫార్మ్‌హౌస్‌లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే రాజు కుమార్ సింగ్ తన లైసెన్సు పిస్టల్‌తో గాల్లోకి పలుమార్లు కాల్పులు జరిపినట్లు విచారణలో తేలింది. ఆ సమయంలో ఒక బుల్లెట్ 45 ఏళ్ల డాక్టర్ అర్చనా గుప్తాకు తగలడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శిక్ష ఖరారు చేసే ముందు రాజు కుమార్ సింగ్ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. తనకు ఎవరినీ చంపే ఉద్దేశం లేదని, తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రజాప్రతినిధినని, సమాజానికి సేవ చేస్తున్నానని, గతంలో ఎలాంటి నేరచరిత్ర లేదని పేర్కొంటూ ప్రొబేషన్‌పై విడుదల చేయాలని కోరారు.
ప్రాసిక్యూషన్ తీవ్ర అభ్యంతరం
అయితే ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ చిరంజిత్ సింగ్ ఈ అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకించారు. సెలబ్రేటరీ ఫైరింగ్ వంటి ఘటనల్లో ప్రొబేషన్ ఇస్తే సమాజానికి తప్పు సందేశం వెళ్తుందని తెలిపారు. ‘‘బాధితురాలి 12 ఏళ్ల కుమార్తె తన తల్లి మరణాన్ని కళ్లారా చూసింది. ఆ కుటుంబం అనుభవించిన మానసిక వేదనను మాటల్లో చెప్పలేం.’’ అని కోర్టుకు వివరించారు. ప్రొబేషన్ అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు.. జూన్ 6న ఇచ్చిన 97 పేజీల తీర్పును ప్రస్తావించింది. ‘‘పండుగలు, వేడుకల సమయంలో గాల్లోకి కాల్పులు జరపడం దేశంలో ప్రాణాలు బలిగొంటున్న ప్రమాదకర సామాజిక వ్యాధిగా మారింది.’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ప్రజలు అధిక సంఖ్యలో ఉన్న ప్రదేశంలో లైసెన్సు పిస్టల్‌తో పలుమార్లు కాల్పులు జరపడం అత్యంత ప్రమాదకర చర్య అని, అందుబాటులో ఉన్న సాక్ష్యాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా కాల్పులు జరిపింది రాజు కుమార్ సింగ్‌నే అని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేకు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ తుది తీర్పు వెలువరించింది.
పదవికి గండం
రాజు కుమార్ సింగ్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష పడటంతో ఆయన సభ్యత్వం రద్దు కావడం దాదాపు ఖాయమైంది. ఉన్నత న్యాయస్థానం నుంచి ఉపశమనం లభిస్తుందా లేదా అనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో పార్లమెంట్ సభ్యుడిని లేదా ఎమ్మెల్యేను తొలగించే ప్రక్రియ ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 8 ద్వారా నియంత్రించబడుతుంది. ఒకవేళ ఎంపీకి లేదా ఎమ్మెల్యేకు క్రిమినల్ కేసులో రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడితే వారి సభ్యత్వం తక్షణమే రద్దు చేయబడుతుంది. గతంలో, శిక్ష పడిన ప్రతినిధులకు అప్పీల్ చేసుకోవడానికి కొంత సమయం ఉండేది.. కానీ ఇప్పుడు శిక్ష పడిన వెంటనే అనర్హత అమల్లోకి వస్తుంది. అయితే ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు లేదా సుప్రీంకోర్టు) శిక్షపై స్టే మంజూరు చేస్తే, సభ్యత్వాన్ని కాపాడుకోవచ్చు. శిక్ష/బెయిల్‌పై స్టే మాత్రమే సరిపోదు; శిక్షపై స్టే తప్పనిసరి.