
Gold Loan: ఇటీవల కాలంలో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ ప్రస్తుతం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. అయితే బంగారానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మహిళలకు ధరించేందుకు వాడుకోవడమే కాకుండా కష్ట సమయాల్లో ఎంతగానో ఆదుకుంటుంది. అత్యవసరంగా నగదు అవసరమైన వారు తమ బంగారు ఆభరణాలను అమ్మకుండా వాటిని తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం విద్య, వైద్యం, వ్యాపార అవసరాలు, వ్యవసాయ పెట్టుబడులు లేదా ఇతర అత్యవసర ఖర్చుల కోసం చాలామంది గోల్డ్ లోన్‌ను ఎంచుకుంటున్నారు. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFCలు) కూడా తక్కువ సమయంలో రుణం మంజూరు చేయడం వల్ల ఈ రుణాలకు డిమాండ్ మరింత పెరుగుతోంది.
ఇది కూడా చదవండి: iPhone 16: అమెజాన్ సేల్‌లో కళ్లు చెదిరే ఆఫర్.. ఐఫోన్ 16 కేవలం రూ.59,755కే..!
నిపుణుల వివరాల ప్రకారం.. బంగారంపై రుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇటీవల విడుదలైన ఎక్స్‌పీరియన్ (Experian) నివేదిక ప్రకారం, భారతదేశంలో రిటైల్ రుణాల వృద్ధికి ప్రస్తుతం గోల్డ్ లోన్లు ప్రధాన కారణంగా మారాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రిటైల్ రుణాల్లో గోల్డ్ లోన్ల వాటా 18 శాతంగా ఉండగా, 2026 నాటికి అది 41 శాతానికి చేరిందని నివేదిక చెబుతున్నాయి. గత ఐదేళ్లలో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు దాదాపు 130 శాతం వరకు పెరగడం కూడా దీనికి ప్రధాన కారణంగా పేర్కొంది. బంగారం విలువ పెరగడంతో అదే ఆభరణాలపై రుణగ్రహీతలు మరింత ఎక్కువ మొత్తాన్ని పొందగలుగుతున్నారు.
బంగారంపై ఎక్కువ రుణం లభించే అవకాశం:
ఇప్పుడు మీకు బంగారంపై ఎక్కువ రుణం లభించే అవకాశాల ఉన్నాయి. మీరు బ్యాంకుల్లో గానీ, ఇతర సంస్థల్లో గానీ బంగారంపై రుణం పొందాలనుకుంటే గతంలో కంటే అధిక మొత్తంలో రుణం మంజూరు చేసే అవకాశం ఉంది. 2024 జనవరి-మార్చి త్రైమాసికంలో గోల్డ్ లోన్ల పంపిణీ విలువ రూ.483 కోట్లుగా ఉండగా, 2026 ఇదే కాలానికి అది రూ.981 కోట్లకు పెరిగింది.
ఈ పొరపాటు అస్సలు చేయకండి:
మీరు మొదటిసారి బంగారంపై రుణం తీసుకుంటున్నట్లయితే ఈ పొరపాట్లు అస్సలు చేయవద్దని సూచిస్తున్నారు నిపుణులు. వారు చేసే సాధారణ తప్పుల్లో ఒకటి గరిష్టంగా ఎంత రుణం వస్తుందనే అంశానికే ప్రాధాన్యత ఇవ్వడం. కానీ రుణం తీసుకునేటప్పుడు మొత్తం ఖర్చును కూడా పరిశీలించడం చాలా ముఖ్యం. స్టాక్‌టిక్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు విజయ్ మహేశ్వరి ప్రకారం, బ్యాంకులు సాధారణంగా గోల్డ్ లోన్లపై ఏడాదికి 8 నుంచి 11 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తాయి. అదే NBFCలు 9 శాతం నుంచి 18 శాతం వరకు వడ్డీ వసూలు చేసే అవకాశం ఉంది. వడ్డీతో పాటు ప్రాసెసింగ్ ఫీజు, గోల్డ్ వాల్యుయేషన్ ఛార్జీలు, రుణ పునరుద్ధరణ రుసుము, ఆలస్యంగా చెల్లిస్తే జరిమానాలు వంటి అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. అందుకే కేవలం వడ్డీ రేటును మాత్రమే కాకుండా మొత్తం రుణ ఖర్చును సూచించే Annual Percentage Rate (APR) ను కూడా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
లోన్ తిరిగి చెల్లించే విధానం:
తీసుకున్న రుణాలు తిరిగి చెల్లింపు విధానాన్ని కూడా అర్థం చేసుకోవాలి. కొన్ని బ్యాంకులు ప్రతి నెల EMI చెల్లించే అవకాశం కల్పిస్తాయి. మరికొన్ని సంస్థలు బుల్లెట్ రీపేమెంట్ విధానాన్ని అందిస్తాయి. ఇందులో రుణ కాలపరిమితి పూర్తయ్యే సమయంలో ఒకేసారి అసలు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. 2026 ఏప్రిల్‌లో ఆర్బీఐ (RBI) తీసుకొచ్చిన సవరించిన గోల్డ్ లోన్ మార్గదర్శకాల ప్రకారం బుల్లెట్ రీపేమెంట్ రుణాల గరిష్ట కాలపరిమితి 12 నెలలు మాత్రమే ఉండవచ్చు. నెలవారీ ఆదాయం, ఖర్చులు, నగదు ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు అనుకూలమైన రీపేమెంట్ విధానాన్ని ఎంచుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడు కూడా వడ్డీని సకాలంలో చెల్లించాలి. లేకుంటే రెట్టింపు వడ్దీ పడే అవకాశం ఉంది. దీంతో మీరు మరింత నష్టపోయే ప్రమాదం ఉంది.
ఆభరణాలు తాకట్టు పెట్టే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి?
బంగారంపై రుణం తీసుకునే ముందు రుణదాత అనుసరించే నిబంధనలను పూర్తిగా తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఒకవేళ రుణాన్ని సకాలంలో చెల్లించకపోతే మీ తాకట్టు బంగారంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా ముందస్తుగా తెలుసుకోవాలి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రుణదాతలు బంగారం వేలం వేయాల్సి వస్తే ముందుగానే బహిరంగంగా ప్రకటించాలి. అలాగే తాకట్టు పెట్టిన బంగారం విలువలో కనీసం 90 శాతం రిజర్వ్ ధరను నిర్ణయించాలి. వేలం ద్వారా రుణ బకాయిలు వసూలు చేసిన తర్వాత మిగిలిన మొత్తం ఉంటే అది రుణగ్రహీతకే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ముందుగానే రుణం చెల్లిస్తే అదనపు ఛార్జీలు ఉంటాయా? జప్తు నిబంధనలు ఏమిటి? వంటి విషయాలను కూడా తప్పకుండా అడిగి తెలుసుకోవాలి.
ఇది కూడా చదవండి: Best Scheme: ప్రతి రోజు రూ.50 ఆదా చేస్తే చాలు.. గ్యారంటీగా మీ చేతికి రూ.30 లక్షలు..!
ఇది కూడా చదవండి: RBI: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి