Reading Time: < 1 minute
Shreyas Iyer Blames Ravi Bishnoi Over India Loss England 2nd T20i

భారత్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం తర్వాత భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రెజెంటేషన్ వేదికపై కీలక వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం జట్టు ఓటమిపై స్పందిస్తూ, మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ ఇన్నింగ్స్‌ను కొనియాడుతూనే, అతడే తమ ఓటమిని శాసించాడని పేర్కొన్నాడు.

“మ్యాచ్ ఎక్కడ చేజారిందో మనందరికీ తెలుసు. కానీ నేను ఏ ఒక్క ఆటగాడిని వేలెత్తి చూపించాలనుకోవడం లేదు. ఆ తప్పు తర్వాత అతడు బలంగా పుంజుకుంటాడని అనుకున్నాను. ఆ 17వ ఓవర్ మమ్మల్ని కోలుకోలేని దెబ్బతీసింది.  ఈ పిచ్‌పై మేము చేసిన 190 పరుగులు అద్భుతమైన స్కోరు. మొదటి 15 ఓవర్ల వరకు మ్యాచ్‌పై మాకే పూర్తి పట్టు ఉంది. కానీ ఒక్కసారిగా మ్యాచ్ మారిపోయింది. జాకబ్ బెథెల్ ఆడిన ఇన్నింగ్స్‌కు పూర్తి క్రెడిట్ ఇవ్వాలి. వారు గ్రౌండ్ డైమెన్షన్స్, వికెట్‌ను ముందే అంచనా వేశారు” అని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు.

రవి బిష్ణోయ్ వేసిన ఆ 17వ ఓవర్‌లో నో-బాల్స్, ఫ్రీ-హిట్లను వాడుకుంటూ జాకబ్ బెథెల్ ఏకంగా 29 పరుగులు రాబట్టి భారత్ చేతుల్లోంచి విజయాన్ని లాగేసుకున్నాడు. టి20 క్రికెట్‌లో క్రీజ్ దాటి నో-బాల్స్ వేయడం తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుంది. బెథెల్ లాంటి ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌కు ఒకే ఓవర్‌లో నో-బాల్స్ వేసి, ఫ్రీ-హిట్లు ఇస్తే అతడు వదిలిపెట్టడని, ఆ ఓవరే తమ ఓటమిని శాసించిందని స్పష్టం చేశాడు. తమ వైపు ఉందనుకున్న విజయం కాస్త చేజారిపోవడంతో కెప్టెన్ అయ్యర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

మరోవైపు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న జాకబ్ బెథెల్ మాట్లాడుతూ.. “చివరికి అంతా బాగానే ముగిసింది. మేము రెండు వికెట్లు కోల్పోయినప్పుడు హ్యారీ బ్రూక్ మంచి మొమెంటం ఇచ్చాడు. రవి బిష్ణోయ్ వేసిన ఓవర్‌లో నిజాయితీగా చెప్పాలంటే నేను విండ్ (గాలి వాలు), షార్ట్ బౌండరీ ఉన్న వైపు టార్గెట్ చేయాలనుకున్నాను. కానీ కొన్ని ఫ్రీ-హిట్లు లభించడంతో బౌలర్ పూర్తిగా ఒత్తిడిలోకి వెళ్ళిపోయాడు, అది నాకు కలిసి వచ్చింది. ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుపై ఇలాంటి ప్రదర్శన చేయడం ఆనందంగా ఉంది” అని అన్నాడు. ఈ ఓటమితో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ వెనుకంజలో పడింది.