
డబ్బు ఆనందాన్ని కొనలేదు కానీ స్వేచ్ఛను ఇవ్వగలదంటూ 39 ఏళ్ల ప్రొఫెషనల్ చేసిన పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో సంచలనంగా మారింది. బాల్యంలోని భయాల నుంచి బయటపడిన ఒక మనిషి స్వేచ్ఛ కోసం చేసిన పోరాటం తెలిపిన పదాల వెనుక ఉన్న క్రేజీ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి..
ఉత్తరప్రదేశ్‌లోని ఒక పట్టణంలో పెరిగిన అతని బాల్యం బయటకు సాధారణంగా కనిపించినా.. ఇంట్లో పరిస్థితి మాత్రం భిన్నం. ఆర్థికంగా ఇబ్బందులు లేకపోయినా, భావోద్వేగంగా ఇల్లు ప్రశాంతంగా ఉండేది కాదు. తరచూ గొడవలు, శిక్షలు, భయంతో జీవించే రోజులు అతని చిన్ననాటి భాగమయ్యాయి. క్లాస్ 11లోనే ఇంటి నుంచి పారిపోవాలని కూడా అనుకున్నాడట. కానీ ఆ క్షణంలో అతను మరో నిర్ణయం తీసుకున్నాడు. విద్య అతనికి స్వేచ్ఛను ఇవ్వగలదని తెలుసుకున్నాడు.
కఠిన శ్రమతో అతను 10వ తరగతిలో 90%, 12వ తరగతిలో 97% మార్కులు సాధించాడు. తర్వాత BITS పిలానీలో స్కాలర్‌షిప్‌తో ఇంజినీరింగ్ సీటు సంపాదించాడు. అక్కడే అతని జీవితం మొదటిసారి స్వేచ్ఛను రుచి చూసింది. కొత్త స్నేహాలు, కొత్త ఆలోచనలు, కొత్త ప్రపంచం.. అతని దృష్టిని పూర్తిగా మార్చేశాయి.
ముంబై నుంచి ప్రపంచానికి ప్రయాణం
మొదటి ఉద్యోగం ముంబైలో ప్రారంభమైంది. తక్కువ జీతం, ఎక్కువ ఖర్చులు, కెరీర్ ఒత్తిడి మధ్యనే అతను తనను తాను నిర్మించుకోవడం మొదలుపెట్టాడు. తర్వాత CAT పరీక్ష రాసినా అనారోగ్యం కారణంగా IIM అవకాశం కోల్పోయాడు. కుటుంబ ఒత్తిడి ఉన్నప్పటికీ.. మరో మంచి బిజినెస్ స్కూల్‌ను ఎంచుకున్నాడు. ఒక స్నేహితుడు ఇచ్చిన రూ.10వేల సహాయం అతని జీవితంలో మర్చిపోలేని క్షణంగా నిలిచింది.
2.2 కోట్ల జీతం కానీ అసలు విజయం వేరే
కాలక్రమంలో అతను గ్లోబల్ FMCG కంపెనీలో ఎదిగాడు. ముంబై నుంచి బెంగళూరు, అక్కడి నుంచి మిడిల్ ఈస్ట్, యూరప్, సౌత్ ఈస్ట్ ఆసియా వరకు అతని కెరీర్ విస్తరించింది. నేడు అతను సంవత్సరానికి రూ.2.2 కోట్లు సంపాదిస్తూ.. రూ.14 కోట్ల నెట్ వర్త్ సాధించాడు. కానీ అతని మాటల్లో అసలు విజయం డబ్బు కాదు. సక్సెస్ అంటే ప్రశాంతమైన ఇల్లు అని భావిస్తున్నారు.
ALSO READ : హైదరాబాద్ కౌలాలంపూర్ ఫ్లైట్ లో సాంకేతిక లోపం…
తన పిల్లలు భయంలేకుండా పెరుగుతున్నారని అతను చెబుతున్న మాటే అందరినీ కదిలించింది. చిన్ననాటి భయాలు, ఇంట్లో ఒత్తిడి, భావోద్వేగ గాయాలు ఇప్పటికీ పూర్తిగా పోకపోయినా.. తన పిల్లలకు మాత్రం భిన్నమైన బాల్యం ఇవ్వగలిగానని గర్వంగా చెబుతున్నాడు ఆ తండ్రి. రెడ్డిట్ వేదికగా పంచుకున్న ఈ స్టోరీ డబ్బు జీవితంలో అన్నీ ఇవ్వలేకపోయినా స్వేచ్ఛను కొనగలదని నిరూపించింది.