
నిజామాబాద్, వెలుగు: బస్సు ఎక్కే వృద్ధుల బంగారు గొలుసులు చోరీ చేస్తున్న తల్లి, కొడుకు, కూతురు, కోడలితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.10 లక్షల విలువైన 6.3 తులాల బంగారం, కారును స్వాధీనం చేసుకున్నారు.
నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్‌యాదవ్ శనివారం తన ఛాంబర్లో మీడియాకు వివరాలు వెల్లడించారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణం నయాబాదికి చెందిన ఖుతీజాబేగం(67) గతంలో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చింది. కొడుకు షేక్ అంజద్, కోడలు తాహెరా, కూతురు నజ్మాబేగం, నయాబాదికి చెందిన కారుడ్రైవర్ అబ్దుల్ జుబేర్, షేక్ వసీం అహ్మద్‌తో కలిసి ముఠా ఏర్పాటు చేసింది. వీరంతా కలిసి ఆర్టీసీ బస్సుల్లో ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలను టార్గెట్ చేస్తారు. ఖుతీజాబేగం వారితో మాటలు కలిపి ఎక్కడికి వెళ్తున్నారో? తెలుసుకొని తానూ అటే వెళ్తున్నట్లు నమ్మిస్తుంది.
బస్సు ఎక్కే టైంలో మెడలో నుంచి చైన్ లాగేసుకుంటుంది. అలాగే బస్‌లో కొడుకు, కోడలు, కూతురుతో ప్రయాణం చేస్తూ అదను చూసి గోల్డ్ చైన్లు మాయం చేసి తరువాతి స్టాప్‌లో అందరూ దిగి అబ్దుల్ జుబేర్ కారులో వెళ్లిపోతారు. బంగారాన్ని నగదుగా మార్చుకునేందుకు షేక్ వసీం అహ్మద్ సహకరిస్తాడు. ఇలా నిర్మల్ జిల్లా కుబీర్, భైంసా, ముథోల్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో దొంగతనాలు చేశారు. నార్త్ రూరల్ సీఐ బి.శ్రీనివాస్, ఎస్సై శ్రీకాంత్, ఏఎస్సై గఫార్ పాల్గొన్నారు.