
Balochistan: పాకిస్థాన్‌లోని బలోచిస్తాన్ ప్రాంత్, గ్వాదర్ జిల్లా పరిధిలోని జీవాని ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. కంటిన్యూస్ సెక్యూరిటీ ఉండే పాకిస్థాన్ కోస్ట్ గార్డ్ క్యాంప్‌ను లక్ష్యంగా చేసుకుని నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘బలోచ్ లిబరేషన్ ఆర్మీ’ (BLA) ఈ దాడికి పాల్పడింది. ఈ భీకర దాడిలో 30 మందికి పైగా పాక్ భద్రతా సిబ్బంది మరణించారని, పలువురు తీవ్రంగా గాయపడ్డారని BLA ప్రకటించింది. అయితే ఈ ఘటనపై పాక్ ఆర్మీ కానీ, అక్కడి ప్రభుత్వం కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
బలోచిస్థాన్ పోస్ట్ నివేదిక ప్రకారం.. శుక్రవారం సాయంత్రం స్థానిక సమయం 6:32 గంటలకు BLA ప్రత్యేక వింగ్ ‘మజీద్ బ్రిగేడ్’ ఈ దాడిని పక్కా ప్లాన్‌తో అమలు చేసింది. అల్తావుల్లా బలోచ్ అలియాస్ అజ్మల్ అనే ఆత్మాహుతి బాంబర్, పేలుడు పదార్థాలతో నిండిన ఒక భారీ మాజ్దా ట్రక్‌ను కోస్ట్ గార్డ్ క్యాంప్‌లోకి దూకించాడని BLA తెలిపింది. ఈ పేలుడు ధాటికి క్యాంప్ లోపల భారీ అగ్నిప్రమాదం జరిగి, ఆ సైనిక స్థావరం మొత్తం మట్టికుప్పగా మారిపోయిందని BLA ప్రతినిధి జీయంద్ బలోచ్ పేర్కొన్నాడు. ట్రక్ బాంబు పేలుడు జరిగిన వెంటనే BLA కి చెందిన ‘ఫతే స్క్వాడ్’ రక్షణ సిబ్బందిపై నాలుగు వైపుల నుంచి తుపాకులతో విరుచుకుపడింది. అక్కడ మిగిలి ఉన్న పాక్ జవాన్లతో ఎదురుకాల్పులు జరిపి, దాదాపు 30 మందిని మట్టుబెట్టినట్లు ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోవడంతో ఈ మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. బలోచిస్థాన్‌కు పూర్తి స్వాతంత్య్రం వచ్చే వరకు పాక్ భద్రతా బలగాలపై తమ సాయుధ పోరాటం ఇలాగే కొనసాగుతుందని BLA ఈ సందర్భంగా హెచ్చరించింది. ప్రస్తుతం ఈ ఘటనపై పాకిస్థాన్ రక్షణ శాఖ పూర్తి వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. క్యాంప్‌కు జరిగిన నష్టంపై కానీ, సైనికుల మరణాలపై కానీ ఇప్పటి వరకు ఎలాంటి వివరాలను బయటకు పొక్కకుండా జాగ్రత్త పడింది.