
Vaibhav Suryavanshi : భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం స్టార్ట్ అయింది. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌తో వైభవ్ తన అద్భుతమైన ప్రయాణాన్ని మొదలు పెట్టడమే కాకుండా, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట దశాబ్దాలుగా ఉన్న అరుదైన రికార్డును బ్రేక్ చేసేశాడు.
సచిన్ రికార్డు కనుమరుగు:
వైభవ్ సూర్యవంశీ డెబ్యూతో భారత క్రికెట్ చరిత్ర పుస్తకాల్లో ఒక మార్పు చోటు చేసుకుంది. దశాబ్దాలుగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు ఇప్పుడు కనుమరుగైంది. ప్రస్తుతం వైభవ్ 15 సంవత్సరాల, 3 నెలల, 7 రోజుల వయస్సులో ఇంగ్లాండ్ గడ్డపై డెబ్యూ చేశాడు. ఇక సచిన్ టెండూల్కర్1989లో 16 సంవత్సరాల, 205 రోజుల వయసులో పాకిస్థాన్‌పై అరంగేట్రం చేశారు. కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే బ్లూ జెర్సీని ధరించి, ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన వైభవ్, భారత పురుషుల క్రికెట్ జట్టు తరఫున ఆడిన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా (Youngest Indian Cricketer) చరిత్ర పుటల్లో నిలిచాడు.
ఐపీఎల్ నుంచి ఇంటర్నేషనల్ స్టేజీ వరకు:
వైభవ్ సూర్యవంశీ ఈ స్థాయికి రావడానికి కారణం ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో అతను ప్రదర్శించిన అద్భుతమైన ఆటతీరు. రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన ఈ టీనేజర్, టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అసాధారణ స్ట్రైక్ రేట్‌తో బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టిన వైభవ్, భారత సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఐర్లాండ్ పర్యటనలో ఛాన్స్ రాకపోయినా, ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టీ20లో బెంచ్‌కే పరిమితమైనా.. వైభవ్ తన శ్రమతో ఈరోజు తుది జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.
ALSO READ : బెంచ్‌పై కూర్చోబెట్టి విసిగించారు?.. అసంతృప్తిలో వైభవ్.. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీతో కొత్త చర్చ!
ఫ్యూచర్ స్టార్ క్రికెటర్:
15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ ఒత్తిడిని ఎదుర్కొంటూ, దిగ్గజాల సరసన అరంగేట్రం చేయడం సాధారణ ముచ్చట కాదు. వైభవ్ సూర్యవంశీలోని ప్రతిభ, పోరాట పటిమ చూస్తుంటే, రాబోయే రోజుల్లో అతను భారత క్రికెట్‌లో మరెన్నో రికార్డులను సృష్టించడం ఖాయమని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ వండర్ కిడ్ అరంగేట్రంతో కోట్లాది మంది భారత అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.