Reading Time: 3 minutes

విమానాలకు CV లేజర్ డేంజర్.. రన్‌‌‌‌వే కనిపించక పైలట్ల ఆందోళన

Caption of Image.
  •  ల్యాండింగ్‌‌‌‌ టైంలో  కాక్​పిట్లలోకి హైపవర్ లేజర్ కిరణాలు 
  • ఎయిర్ పోర్టు చుట్టుపక్కల     ఫామ్ హౌస్ లు, కన్వెన్షన్ హాళ్లు 
  • వేడుకల పేరుతో పర్మిషన్ లేకుండా హై బీమ్​ లేజర్ లైట్ల వినియోగం 
  • 144 సెక్షన్​ ఉన్నా పట్టించుకోవట్లే

హైదరాబాద్ సిటీ, వెలుగు : ఇటీవల శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​కు వస్తున్న జర్మన్ ఎయిర్‌‌‌‌లైన్స్​కు చెందిన లుఫ్తాన్సా విమానంపై హై-పవర్ లేజర్ లైట్లు పడడం తీవ్ర కలకలానికి దారి తీసింది. ల్యాండింగ్​కు కొద్ది నిమిషాల ముందు గాలిలో ఉండగానే లైట్లు నేరుగా కాక్‌‌‌‌పిట్‌‌‌‌లోకి రావడంతో పైలట్లకు కొన్ని సెకన్ల పాటు ఏమీ కనిపించలేదు. కలవరానికి గురైనా చాకచక్యంగా వ్యవహరించి సురక్షితంగా ల్యాండ్​ చేయగలిగారు. 

తూర్పు వైపు నుంచి లేజర్​ లైట్లు వచ్చాయని, చర్యలు తీసుకోవాలని ఏటీసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. ఫిబ్రవరిలో కూడా రన్‌‌‌‌వే వైపు దూసుకొచ్చిన లేజర్ లైట్ల కాంతితో ఎయిర్​పోర్ట్​అధికారులు టెన్షన్​పడ్డారు. అదృష్టవశాత్తు ఏ ఫ్లైట్​ కూడా ల్యాండింగ్ కు ​లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

 ఫామ్​హౌస్​లు, కన్వెన్షన్​ హాల్స్​ నుంచేనా? 

శంషాబాద్ ఎయిర్‌‌‌‌పోర్ట్ చుట్టుపక్కల పెద్ద సంఖ్యలో ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లు, కన్వెన్షన్ హాల్స్​ఉన్నాయి. అక్కడ జరిగే పెళ్లిళ్లు, బర్త్‌‌‌‌డే పార్టీలు, ఈవెంట్లలో వినోదం కోసం నిర్వాహకులు హైపవర్​ లేజర్​ బీమ్​లైట్లు వాడుతుంటారు. ఈ లైట్లు ఏమాత్రం పక్కకు చెదరకుండా, ఒకే దారిలో ప్రకాశవంతంగా ప్రయాణిస్తాయి. సాధారణ ఈవెంట్ లేజర్లు 10 వాల్ట్స్​ నుంచి – 30 వాల్ట్స్ ఉండేవి ​ఆకాశంలో 2 నుంచి 5 కిలోమీటర్లు,  300 వాల్ట్స్​హైపవర్ అవుట్‌‌‌‌డోర్ లేజర్లు 10 నుంచి 15 కిలోమీటర్లు, 600 వాల్ట్స్​ ఏకంగా 20 నుంచి 30 కిలోమీటర్లు..ఒక్కోసారి అంతకన్నా ఎక్కువ దూరం కూడా వెళ్లగలవు.  

18.5 కిలోమీటర్ల వరకూ లేజర్​ వాడొద్దు

విమానాశ్రయాల చుట్టుపక్కల లేజర్ లైట్లు వేయకూడదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ , కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్ట్రిక్ట్​ రూల్స్​ పెట్టాయి.  అలాగే, విమానాలు సురక్షితంగా ల్యాండ్ కావడానికి ఎయిర్​పోర్ట్​ల చుట్టూ  లేజర్ బీమ్ ఫ్రీ ఫ్లైట్ జోన్, లేజర్ బీమ్ క్రిటికల్ ఫ్రీ జోన్, లేజర్ బీమ్ సెన్సిటివ్ ఫ్రీ జోన్ అని మూడు జోన్లను ప్రకటించింది. దీని ప్రకారం ఎయిర్​పోర్ట్ ​నుంచి 18.5 కిలోమీటర్ల వరకు హై-ఇంటెన్సిటీ లేజర్ లైట్లు వాడకూడదు. ఎవరైనా రూల్స్​ బ్రేక్​ చేస్తే కనీసం 3 నెలల నుంచి గరిష్టంగా 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ. కోటి వరకు జరిమానా విధిస్తారు. ఒకవేళ ఎవరైనా చుట్టుపక్కల లేజర్​షో నిర్వహించాలనుకుంటే 48 గంటల ముందు పర్మిషన్​ తీసుకోవాలి. మన సిటీ విషయానికి వస్తే శంషాబాద్​ఎయిర్​పోర్ట్​ చుట్టుపక్కల 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో లేజర్ షోలు నిర్వహించకూడదని 144 సెక్షన్​ కూడా పెట్టారు.  అయినా ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌ ల ఓనర్లు, కన్వెన్షన్​హాల్స్​ యజమానులు  పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.   

‘లుఫ్తాన్సా’ తర్వాత తీసుకున్న చర్యలేమిటి? 

లుఫ్తాన్సా ఘటన తర్వాత విచారణ ప్రారంభించిన ఏటీసీ, శంషాబాద్​ రూరల్​ పోలీసులు విమానం గాలిలో ఉండగానే తూర్పు వైపు నుంచి అంటే ఉప్పల్​, ఇబ్రహీంపట్నం ప్రాంతాల నుంచి లేజర్​ లైట్లు వచ్చాయని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.  కానీ, పైలట్​ రెండు గంటల తర్వాత ఫిర్యాదు చేయడం వల్ల లొకేషన్​ను గుర్తించడం దాదాపు అసాధ్యమని అంటున్నారు. ఇదివరకు కూడా ఎయిర్​పోర్ట్​ చుట్టుపక్కల ఉన్న ఫాంహౌస్​లు, కన్వెన్షన్​ హాల్స్​  నుంచి డీజే లైట్లు వాడడంతో అవి  పైలట్లను ఇబ్బందులకు గురి చేశాయి. 

లేజర్​ లైట్లతో ఎక్కడేం జరిగింది? 

ఇప్పటివరకు ప్రపంచంలో లేజర్​లైట్ల వల్ల ఎలాంటి విమాన ప్రమాదం జరగలేదు. కానీ,  గత నెల జూన్ 27న న్యూఢిల్లీ నుంచి గుజరాత్‌‌‌‌లోని సూరత్ వస్తున్న ఇండిగో ఫ్లైట్ రాత్రివేళ ల్యాండ్ అవుతుండగా కాక్‌‌‌‌పిట్‌‌‌‌లోకి గ్రీన్ లేజర్ కాంతి దూసుకొచ్చింది. అలాగే, ఢిల్లీ , ముంబై ఎయిర్‌‌‌‌పోర్ట్ పరిసరాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. 2016లో లండన్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న వర్జిన్ అట్లాంటిక్ విమానం టేకాఫ్ అయిన గంట కే లేజర్​ లైట్ల ప్రభావంతో తిరిగి లండన్ హీత్రూ ఎయిర్​పోర్ట్​కు తిరిగిరావాల్సి వచ్చింది. లేజర్ లైట్ కాక్‌‌‌‌పిట్‌‌‌‌లోకి రావడంతో పైలట్లలో ఒకరు అస్వస్థతకు గురయ్యారు. 

అమెరికా, యూరప్‌‌‌‌లో అనేక పోలీస్, మెడికల్ హెలికాప్టర్ల రెస్క్యూ మిషన్లు లేజర్ లైట్ల కారణంగా నిలిచిపోయాయి. 2009లో అమెరికాలో 1,489 లేజర్ లైట్లు పడిన ఘటనలు చోటు చేసుకోగా, 2010లో ఈ సంఖ్య 2,836కి చేరింది. 2023లో ఏకంగా 13,304 సంఘటనలు నమోదయ్యాయని అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. దీనిని ఎదుర్కొనేందుకు కొత్త టెక్నాలజీని పరీక్షిస్తున్నామని చెప్పింది. 

  భవిష్యత్తులో  ఇలా అరికట్టొచ్చు  

మన దేశంతో పాటు అభివృద్ధి చెందిన దేశాల్లోనూ విమానాలపై లేజర్​ లైట్లు వేస్తున్న వారిని పట్టుకోవడానికి ఎలాంటి టెక్నాలజీ లేదు. కాకపోతే, ఎంఐటీ లింకన్ ​లాబొరేటరీ.. లావోస్ ​అనే సిస్టమ్​ను డెవలప్ ​చేసింది. ఇది ఇంకా పరీక్షల దశలోనే ఉంది.  16 కిలోమీటర్ల దూరం నుంచి ఎవరు లేజర్​ వేసినా 30 సెకన్లలోపే ఆ లొకేషన్‌‌‌‌ను గుర్తిస్తుంది. ఇందులోని పవర్​ఫుల్​ కెమెరాలు ఆకాశంలోకి వచ్చే లేజర్ కిరణాలను ఫొటోలు తీస్తాయి. 

వాటి ఆధారంగా కంప్యూటర్ అల్గారిథమ్స్ లేజర్ ఎక్కడి నుంచి వచ్చిందో  చూసి గూగుల్ ఎర్త్ సాయంతో నిందితుడి ఖచ్చితమైన ఇంటి అడ్రస్ లేదా లొకేషన్‌‌‌‌ను మ్యాప్ లో చూపిస్తాయి. దీన్ని అమెరికాలోని బోస్టన్ లోగాన్ విమానాశ్రయంలో, హ్యాన్స్కామ్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో సక్సెస్​ఫుల్​గా పరీక్షించి చూశారు. భవిష్యత్తులో అందుబాటులోకి వస్తే దేశంలోని అన్ని ప్రధాన  విమానాశ్రయాల్లో లేజర్ తో ఇబ్బందులు పెడుతున్న వారిని ఈజీగా పట్టుకోవచ్చు

©️ VIL Media Pvt Ltd.