
E20 petrol: E20 పెట్రోల్‌పై భారత్‌లో తీవ్ర చర్చ జరుగుతోంది. వాహనాలను దెబ్బతీస్తోందని పలువురు ఈ పెట్రోల్‌ను వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో భారత్ E20 పెట్రోల్‌ను భూటాన్‌కు ఎగుమతి చేయాలని భావించింది. అయితే, ఈ ప్రతిపాదనను భూటాన్ సున్నితంగా తిరస్కరించిందని ‘‘ది భూటానీస్’’ వార్తాపత్రిక నివేదించింది. భారత మార్కెట్‌లో సాధారణ పెట్రోల్ అందుబాటులో ఉన్నంత కాలం తమకు దానినే సరఫరా చేయాలని కోరింది.
అసలు కారణం ఇదే:
వాస్తవానికి భూటాన్ E20 పెట్రోల్ తిరస్కరించడానికి కారణం వేరేలా ఉంది. భూటాన్ దేశంలో ఇప్పటికీ పాతబడిన, బలహీనమైన ఇంధన నిల్వ మౌలిక సదుపాయాలే ఉన్నాయి. దేశంలో చాలా ఇంధన ట్యాంకులు భూగర్భంలోనే ఉన్నాయి. దీనివల్ల E20 పెట్రోల్‌ను నిల్వ చేయడం కష్టమవుతుంది. శాస్త్రీయంగా, ఇథనాల్‌లో హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంటుంది, ఇది దానిని అత్యంత హైగ్రోస్కోపిక్‌గా చేస్తుంది, అంటే అది వాతావరణం నుండి తేమను సులభంగా గ్రహిస్తుంది. నీరు లీక్ అయ్యే అవకాశం ఉంది. దీని వల్ల E20 పెట్రోల్ పాడైపోయి, వాహనాలకు నష్టం కలిగించే అవకాశం ఉంది. ఇదే కాకుండా భూటాన్ పూర్తిగా పర్వతాలలో ఉండే దేశం. ఈ దేశంలో వాహనాలు మరింత శక్తివంతంగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో E20 పెట్రోల్ ఆశించినంతగా పనిచేయని స్థితి ఉంటుంది.
ప్రస్తుతం భూటాన్ భారత్ నుంచి అధిక నాణ్యత కలిగిన ఎక్స్‌పోర్ట్ గ్రేడ్ పెట్రోల్, డీజిల్‌ను కొనుగోలు చేస్తోంది. దీని ధర భారత బంకుల్లో విక్రయించే ఇంధనం కన్నా ఎక్కువ. దీంతోనే E20 పెట్రోల్ ప్రతిపాదనను భూటాన్ తిరస్కరించింది. ఇదే కాకుండా సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే, E20లో నీటి కాలుష్యం ఎక్కువగా వ్యాపిస్తుంది. ఇలాంటి ఇంధనంలో నీరు కరిగితే, దానిని వేరు చేయడం చాలా కష్టం. దీని వల్ల ఇంధన నాణ్యత దెబ్బతిని, స్టీల్ ట్యాంకులు, పైప్ లైన్‌లు తుప్పుపట్టే ప్రక్రియ వేగవంతం అవుతుంది. భూటాన్‌లో చాలా ఇంధన డిపోలు పర్వత ప్రాంతాలు, అధిక తేమ ఉన్న ప్రదేశాల్లో ఉంటాయి. దీని వల్ల ట్యాంకుల్లో తేమ లేదా ఘనీభవనాన్ని నివారించడం చాలా కష్టం. ఈ కారణాలతో భూటాన్ E20 పెట్రోల్‌ను సరఫరా చేయాలని చూసిన భూటాన్ తిరస్కరించింది.
భారత్‌లో వివాదంగా E20:
20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ మిశ్రమమైన E20 పెట్రోల్‌పై భారతదేశంలో ఇప్పటికే వివాదం నడుస్తోంది. పెట్రోల్ వాహనాల యజమానులు, ముఖ్యంగా 2023కి ముందు తయారైన వాహనాల యజమానులు, మైలేజ్ తగ్గడం, నిర్వహణ ఖర్చులు పెరగడం, ఇంజిన్‌పై అదనపు భారం పడటం వంటి సమస్యలపై ఫిర్యాదు చేస్తున్నారు. మరోవైపు, ఈ ఇంధనం వల్ల మైలేజ్ తగ్గినప్పటికీ, ఇంజన్ పనితీరు, యాక్సిలరేషన్ మెరుగుపడుతాయని ప్రభుత్వం వాదిస్తోంది.