Reading Time: 2 minutes
Emraan Hashmi Regrets Calling Aishwarya Rai Plastic Ready To Apologize Personally

Emraan Hashmi: దాదాపు పదేళ్ల క్రితం ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ను “ప్లాస్టిక్” అని వ్యాఖ్యానించిన ఇమ్రాన్, ఇప్పుడు ఆ మాటలపై తనకు పశ్చాత్తాపం ఉందని అంగీకరించారు. అంతేకాదు, ఆ వ్యాఖ్యతో ఆమె మనస్తాపానికి గురై ఉంటే వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పుడు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2014లో కరణ్ జోహార్ నిర్వహించిన ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో పాల్గొన్న ఇమ్రాన్ హష్మీ, ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో భాగంగా ఐశ్వర్య రాయ్ గురించి “ప్లాస్టిక్” అనే పదాన్ని ఉపయోగించారు. ఆ సమయంలో అది షో ఫార్మాట్‌లో భాగంగా చెప్పిన సరదా మాటగా కనిపించినప్పటికీ, తర్వాత అది పెద్ద వివాదంగా మారింది. సోషల్ మీడియాలో కూడా ఈ వ్యాఖ్యపై చాలాకాలం పాటు విమర్శలు వ్యక్తమయ్యాయి.

తాజాగా జర్నలిస్ట్ సౌరభ్ ద్వివేదికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై ప్రశ్నించగా, ఇమ్రాన్ ఎలాంటి సాకులు చెప్పకుండా నేరుగా స్పందించారు. ఆ వ్యాఖ్య చేసినందుకు తనకు నిజంగానే పశ్చాత్తాపం ఉందని చెప్పారు. ఐశ్వర్య రాయ్‌ను తాను ఇప్పటివరకు వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదని, ఆమెతో మాట్లాడే అవకాశం కూడా రాలేదని వెల్లడించారు. ఈ సందర్భంగా ఐశ్వర్యపై తనకున్న అభిమానాన్ని కూడా ఇమ్రాన్ గుర్తు చేసుకున్నారు. ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ చిత్రం చూసిన తర్వాత ఆమెకు తాను పెద్ద అభిమానిగా మారిపోయానని చెప్పారు. ఒక్కసారైనా ఆమెను చూడాలని ఆమె వ్యాన్ బయట దాదాపు మూడు గంటల పాటు ఎదురుచూసిన సందర్భం కూడా ఉందని గుర్తుచేసుకున్నారు. ఈ విషయం ప్రస్తావిస్తూ, తాను ఎప్పుడూ ఆమెను గౌరవంగానే చూసానని వివరించారు.

ఇప్పుడు అవకాశం వస్తే ఐశ్వర్య రాయ్‌ను తప్పకుండా కలవాలని ఉందని ఇమ్రాన్ తెలిపారు. ఒకవేళ తన వ్యాఖ్య ఆమెను బాధపెట్టి ఉంటే ఎలాంటి సంకోచం లేకుండా క్షమాపణ చెబుతానని స్పష్టం చేశారు. తన మాటల వల్ల ఆమె మనస్తాపానికి గురై ఉంటే దానికి బాధ్యత వహించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇమ్రాన్ హష్మీ తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారాయి. గతంలో చేసిన వ్యాఖ్యను సమర్థించుకునే ప్రయత్నం చేయకుండా, షో ఫార్మాట్‌ను కారణంగా చూపకుండా, అది తప్పేనని ఒప్పుకుని క్షమాపణ చెప్పేందుకు ముందుకు రావడం చాలా మంది నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు.