
ఇరాన్ మాజీ సర్వోన్నత నాయకుడు అయతోల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీరు మున్నీరవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇరాన్‌లో దీనికి పూర్తి భిన్నమైన వాతావరణం ఉంటుందని తాను ఊహించానని ఆయన అన్నారు. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ‘ఆక్సియోస్’ (Axios) కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అంత్యక్రియల దృశ్యాల గురించి ట్రంప్ మాట్లాడుతూ.. “అక్కడ జనాలు ఏడవడం చూసి నేను నిజంగా దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇరాన్ ప్రజలు ఖమేనీని ద్వేషిస్తున్నారని నేను అనుకున్నాను” అని చెప్పుకొచ్చారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన రోజున (ఫిబ్రవరి 28) జరిగిన దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కొందరు మరణించారు. దాదాపు 36 ఏళ్ల పాటు ఇరాన్‌ను ఏలిన ఖమేనీకి వారం రోజుల పాటు అంత్యక్రియల కార్యక్రమాలు నిర్వహించడానికి ఇరాన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. శనివారం టెహ్రాన్‌లో జరిగిన సంతాప సభకు లక్షలాది మంది ప్రజలు నల్లటి దుస్తులు ధరించి తరలివచ్చారు. ఖమేనీ ఫోటోలు పట్టుకుని “మా మాట ఒక్కటే.. ప్రతీకారం!” అంటూ నినాదాలు చేశారు.
వారం రోజుల అంత్యక్రియల షెడ్యూల్
ఖమేనీ భౌతికకాయాన్ని కొన్ని రోజుల పాటు వేర్వేరు నగరాలకు తీసుకెళ్లనున్నారు:
*మంగళవారం (జూలై 7) రోజున పవిత్ర నగరమైన ఖోమ్‌కు తరలిస్తారు.
*బుధవారం రోజున ఇరాక్ దేశంలో ఊరేగింపు ఉంటుంది.
*గురువారం (జూలై 9) రోజున ఆయన స్వస్థలమైన మషద్‌లో అంత్యక్రియలు (ఖననం) జరుగుతాయి.
ఈ దాడిలో మరణించిన ఖమేనీ 14 నెలల మనవరాలు జహ్రా మొహమ్మది, ఆయన కుమార్తె, అల్లుడు, కుమారుడి భార్యలను కూడా ఆయనతో పాటే ఖననం చేయనున్నారు.
అంత్యక్రియలకు కొడుకు మోజ్తాబా
ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ కొత్త సర్వోన్నత నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన కొడుకు ‘మొజ్తబా ఖమేనీ’ ఈ అంత్యక్రియలకు హాజరుకావడం లేదు. దీనికి భద్రతా కారణాలే ముఖ్య కారణమని భారతదేశంలోని ఇరాన్ ప్రతినిధి అయతోల్లా హకీమ్ ఎలాహి తెలిపారు. ఇజ్రాయెల్ నుండి దాడుల ముప్పు, నిఘా ప్రమాదం ఎక్కువగా ఉన్నందున, ఆయన బహిరంగంగా ప్రజల ముందుకు రావడం క్షేమకరం కాదని ఇరాన్ భద్రతా సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
ట్రంప్ చేసిన మరో సంచలన వ్యాఖ్య
ఈ ఇంటర్వ్యూలోనే ట్రంప్ ఇరాన్ పాలకులకు గట్టి హెచ్చరిక కూడా జారీ చేశారు. “ఇరాన్ లీడర్లంతా ఇప్పుడు ఒకే చోట గుమిగూడారు. మేము అనుకుంటే ఒక్క షాట్‌తో వాళ్లందరినీ లేపేయొచ్చు. కానీ మేము అలా చేయం. ఎందుకంటే ఆ తర్వాత చర్చలు జరపడానికి అక్కడ ఎవరూ మిగలరు. ఇరాన్ ఇప్పుడు ఎలాగైనా ఒక ఒప్పందానికి రావాలని పాకులాడుతోంది” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం అంత్యక్రియల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దాడులు జరగకుండా వారం రోజుల పాటు చర్చలకు తాత్కాలిక విరామం ఇచ్చారు. ఈ అంత్యక్రియలు ముగిసిన తర్వాతే మళ్లీ చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది.