Reading Time: < 1 minute
Pok Crisis Jaac Alleges Pakistan Crackdown Ahead Of July 5 Shutdown

PoK: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లో నిరసనలు మిన్నంటాయి. హక్కుల కోసం ఉద్యమిస్తున్న కాశ్మీరీలను పాకిస్తాన్ సైన్యం దారుణంగా అణిచివేస్తోంది. రావల్‌కోట్‌లో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిపై రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఒక పౌరుడు మరణించగా, ఆరుగురు గాయపడినట్లు తెలుస్తోంది. పాక్ భద్రతా బలగాలు, ఫెడరల్ పారామిలిటరీ యూనిట్లు నిరాయుధులైన, శాంతియుత నిరసనకారులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

జూలై 5న ప్రకటించిన బంద్‌కు ముందు నిరసనకారులుపై పాక్ భద్రతా బలగాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయని జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఆరోపించింది. ఈ నేపథ్యంలో భారత్‌తో పాటు అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. పీఓకేలో కాల్పులకు పాల్పడిన తర్వాత పాక్ ప్రభుత్వం ఇంటర్నెట్, ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలపై ఆంక్షలు విధించింది. ప్రధాన రహదారులు మూసేసి, ప్రజలు రాకపోకల్ని పరిమితం చేసినట్లు JAAC తెలిపింది. పీఓకే దిగ్బంధించిన పాకిస్తాన్, అక్కడి ప్రజలకు ఆహార సరఫరాను అడ్డుకుంటోంది.

ఇదిలా ఉంటే ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న JAACను జూన్ 5న పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చట్టం కింద నిషేధిత సంస్థగా ప్రకటించింది. విద్యుత్ ఛార్జీల పెంపు, గోధుమ కొరత, సబ్సిడీ తగ్గింపుకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఈ నిరసనలు తక్కువ కాలంలోనే రాజకీయ ఉద్యమంగా మారింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అసెంబ్లీలో పాకిస్థాన్‌లో నివసించే శరణార్థుల కోసం కేటాయించిన 12 రిజర్వ్ స్థానాలను రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.