Reading Time: 2 minutes
Pm Modi Welcomes Us Iran Peace Deal Hopes For Stability And Free Navigation In West Asia

PM Modi: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతించారు. ఈ ఒప్పందం ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి దారితీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రపంచ వాణిజ్యం, సముద్ర మార్గాల రవాణాకు కీలకమైన హార్మూజ్‌ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛ పునరుద్ధరించబడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందించిన ప్రధాని మోడీ.. పశ్చిమాసియాలో జరిగిన ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావానికి గురైందని పేర్కొన్నారు. అనేక దేశాల్లో ప్రాణనష్టం కూడా సంభవించిందని గుర్తు చేశారు. అమెరికా, ఇరాన్‌లు యుద్ధానికి ముగింపు పలికే అవగాహనకు రావడం సానుకూల పరిణామమని అభివర్ణించారు.

అమెరికా-ఇరాన్ మధ్య గత మూడు నెలలుగా కొనసాగిన ఘర్షణ అంతర్జాతీయ ఆందోళనలకు కారణమైంది. ఫిబ్రవరి చివర్లో ప్రారంభమైన ఈ సంక్షోభం ప్రాంతీయ భద్రత, ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపింది. తాజాగా ఇరు దేశాలు శాంతి ప్రతిపాదనపై అంగీకారానికి రావడంతో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఒప్పందంపై అధికారిక సంతకాలు జూన్ 19న స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరగనున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే హార్మూజ్‌ జలసంధి మళ్లీ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం మూతపడటంతో అంతర్జాతీయ సరఫరా గొలుసులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముడి చమురు ధరలు కూడా భారీగా పెరిగాయి. హార్మూజ్‌ జలసంధి తెరుచుకోవడం వల్ల ప్రపంచ వాణిజ్యానికి ఊరట లభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

భారత్ ఎప్పటి నుంచో హార్మూజ్‌ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛ కొనసాగాలని, వివాదాలను సంభాషణలు, దౌత్యపరమైన మార్గాల ద్వారానే పరిష్కరించాలని చెబుతోంది. గత మూడు నెలలుగా ప్రధాని మోడీ పలువురు ప్రపంచ నేతలతో మాట్లాడి ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. శాంతి ఒప్పందం ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై వెంటనే కనిపించింది. బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 83.89 డాలర్లకు పడిపోయాయి. అంతేకాకుండా భారత స్టాక్ మార్కెట్లలో కూడా భారీ ఉత్సాహం కనిపించింది. సెన్సెక్స్ 1,100 పాయింట్లకు పైగా లాభపడి ప్రారంభమవగా, నిఫ్టీ కూడా గణనీయంగా పెరిగింది. రూపాయి విలువ కూడా అమెరికన్ డాలర్‌తో పోలిస్తే బలపడింది. అయితే పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోవడానికి కొంత సమయం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం పశ్చిమాసియాలో స్థిరత్వం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు కీలక మలుపుగా మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.