Reading Time: 2 minutes
Gurgaon Hospital 65k Bill Food Poisoning Sparks Medical Inflation Debate

భారతదేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న వైద్య ఖర్చులు, హెల్త్‌కేర్ ఇన్‌ఫ్లేషన్ పై సామాజిక మాధ్యమాల్లో మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. గుర్గావ్‌లోని ఒక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో సాధారణ ఫుడ్ పాయిజనింగ్ చికిత్సకు ఏకంగా రూ. 65,000 కంటే ఎక్కువ బిల్లు వేయడమే ఇందుకు కారణం. దీనికి సంబంధించిన హాస్పిటల్ బిల్లు ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అభిమన్యు మిట్టల్ అనే వ్యక్తి ఈ బిల్లును తన ఎక్స్ (X) ఖాతాలో పంచుకుంటూ.. “గుర్గావ్‌లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో అక్యూట్ ఫుడ్ పాయిజనింగ్ చికిత్సకు రూ. 65 వేల బిల్లు వేశారు. ప్రస్తుత రోజుల్లో రోగం కంటే కూడా ఈ వైద్య బిల్లులు చూస్తుంటేనే ఎక్కువ భయమేస్తోంది. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అదనపు సదుపాయం కాదు.. బతకడానికి అవసరమైన ప్లానింగ్” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన షేర్ చేసిన బిల్లులో కేవలం రూమ్ ఛార్జీల కోసమే ఏకంగా రూ. 37,500 వసూలు చేయగా, మిగిలిన మొత్తాన్ని ల్యాబ్ ఫీజులు, ఫార్మసీ, కన్సల్టెంట్ ఫీజుల పేరిట లెక్కగట్టారు.

ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఆసుపత్రుల దోపిడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక యూజర్ స్పందిస్తూ.. “మధ్యతరగతి కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కట్టడమే ఒక పెద్ద భారం అయిపోయింది. కనీసం రూ. 1 కోటి పాలసీ లేకపోతే ఏవీ కవర్ కావడం లేదు” అని కామెంట్ చేయగా.. మరొకరు వ్యంగ్యంగా.. “రూమ్ కోసం రూ. 37,500 వసూలు చేశారు.. మీరు ఏమైనా సూపర్ డీలక్స్ రూమ్ తీసుకున్నారా?” అని ప్రశ్నించారు. పట్టణ ప్రాంతాల్లో సామాన్యుడికి నాణ్యమైన వైద్యం ఎంత భారంగా మారిందో ఈ వైరల్ బిల్లు మరోసారి నిరూపించింది.