Reading Time: 2 minutes
Jagan Slams Chandrababu Pawan And Lokesh Over Fuel Saving Claims And Private Chopper Travel

YS Jagan: కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్… ఇంధన పొదుపు గురించి ప్రజలకు బోధనలు చేస్తూనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ మాత్రం ప్రైవేట్ చాపర్లలో తిరుగుతున్నారని జగన్ ఆరోపించారు. ప్రజలకు ఇంధనం ఆదా చేయాలని చెబుతున్న నాయకులు, తాము మాత్రం విలాసవంతమైన ప్రయాణాలు చేస్తుండటం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని జగన్ విమర్శించారు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లితే మూడు విమానాలు సిద్ధంగా కనిపిస్తాయని వ్యాఖ్యానించారు.

“పోలీసులు చంద్రబాబు మాటలు వినొద్దు”
పోలీసు అధికారులకు కూడా జగన్ కీలక సూచనలు చేశారు. “చంద్రబాబు మాటలు విని తప్పులు చేయొద్దు. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే ఎక్కడ ఉన్నా వదిలిపెట్టం” అంటూ హెచ్చరించారు. రిటైర్ అయిన తర్వాత కూడా తప్పులు చేసిన వారిపై చర్యలు తప్పవని వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి చేయడానికి ముఖ్యమంత్రి పదవిని ఉపయోగించాలే కానీ దుర్మార్గపు పనులకు కాదు అని జగన్ అన్నారు. పోలీసు వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకూడదని సూచించారు.

అమిత్ షా – పవన్ భేటీపై స్పందన
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మరియు పవన్ కళ్యాణ్ మధ్య జరిగినట్లు ప్రచారంలోకి వచ్చిన సంభాషణలపై కూడా జగన్ స్పందించారు. “ప్రజలు జగన్ పాలన చూసారు.. చంద్రబాబు పాలన కూడా చూసారు. అందుకే అలా మాట్లాడి ఉండొచ్చు” అంటూ వ్యాఖ్యానించారు.

తమిళనాడులో విజయ్ ప్రచారంపై జగన్ కామెంట్స్
తమిళనాడులో విజయ్‌ తన ఫొటోతో ప్రచారం చేశారన్న ప్రశ్నకు జగన్ స్పందిస్తూ, “తమిళనాడులో విజయ్‌కే ఎక్కువ పలుకుబడి ఉంది. ప్రజలు ఆయనను చూసే ఓట్లు వేస్తారు. అక్కడ మన ప్రభావం ఆయనకన్నా ఎక్కువగా ఏమీ ఉండదు” అని అన్నారు. ఇక, చంద్రబాబు తన కుమారుడు లోకేష్ చేత “బోత్ ఆర్ నాట్ సేమ్” అంటూ పబ్లిక్ మీటింగ్స్‌లో డైలాగులు చెప్పిస్తున్నారని జగన్ విమర్శించారు. “అవును.. ఇద్దరూ ఎప్పటికీ ఒకేలా ఉండరు” అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. “వెన్నుపోటుతో పార్టీని, పార్టీ గుర్తును దోచుకోవడం మీ చరిత్ర. ప్రజల మద్దతుతో ఎదిగి అధికారంలోకి రావడం మా చరిత్ర” అంటూ జగన్ వ్యాఖ్యానించారు.

“బాబు అంటే మోసం.. జగన్ అంటే నమ్మకం”
ప్రజలకు హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేయడం టీడీపీ నాయకత్వం లక్షణమని జగన్ ఆరోపించారు. మరోవైపు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం తమ ప్రభుత్వ లక్షణమని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, గృహ నిర్మాణం వంటి రంగాల్లో తమ ప్రభుత్వం విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేసిందని చెప్పారు. డీబీటీ ద్వారా అర్హులైన పేదల ఖాతాల్లో నేరుగా రూ.2.73 లక్షల కోట్లను జమ చేశామని గుర్తు చేశారు. అదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి, ఎన్నికల హామీలను గాలికి వదిలేసిందని జగన్ విమర్శించారు. చివరగా “బాబు అంటే మోసం.. జగన్ అంటే నమ్మకం” అంటూ తన వ్యాఖ్యలను ముగించారు.