Reading Time: 2 minutes
Bcci Concern Over Girlfriend Culture Ipl 2026 New Rules Players Policy

BCCI: ఐపీఎల్ 2026 సీజన్ ఆసక్తికరంగా సాగుతున్న వేళ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఓ కీలక అంశంపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా లీగ్‌లో కనిపిస్తున్న “గర్ల్‌ఫ్రెండ్ కల్చర్” పట్ల బోర్డు తీవ్ర అసహనంతో ఉందట. హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్ వంటి స్టార్ ఆటగాళ్లు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి బహిరంగంగా కనిపిస్తుండటం, టీమ్ బస్సుల్లో వారితో కలిసి ప్రయాణించడం, హోటళ్లలో బస చేయడం వంటి అంశాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్న బీసీసీఐ, దీనిని అడ్డుకోవడానికి కొత్త నిబంధనలు రూపొందించే పనిలో పడింది. ముఖ్యంగా, ఆటగాళ్లతో ఉండే ఈ భాగస్వాములలో చాలామంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కావడం బోర్డు ఆందోళనకు ప్రధాన కారణం. గతంలో వీరిలో కొందరు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన సందర్భాలు ఉన్నాయని, వీరి వల్ల జట్టుకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారం బయటకు పొక్కే ప్రమాదం ఉందని బీసీసీఐ భయపడుతోందట.

ఈ కల్చర్ గేమ్ సమగ్రతను దెబ్బతీస్తుందని బోర్డు భావిస్తోంది. అంతేకాకుండా, గతంలో కొంతమంది ఆటగాళ్లకు, వారి మహిళా స్నేహితులకు మధ్య వివాదాలు తలెత్తి పోలీసు ఫిర్యాదుల వరకు వెళ్లడం లీగ్ ప్రతిష్టను, బోర్డు గౌరవాన్ని మసకబార్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో నిబంధనలను కఠినతరం చేయడం తప్పనిసరని బోర్డు నిర్ణయించుకుంది. ఓ ఉన్నత స్థాయి బీసీసీఐ అధికారి ఈ విషయంపై స్పందిస్తూ, ఆటగాళ్ల గర్ల్‌ఫ్రెండ్స్ కోసం టీమ్ బస్సులను ఆపుతున్నారని.. ప్లేయర్స్‌తో పాటే హోటళ్లలో బస చేయడం సరికాదని మండిపడ్డారు. అసలు “అధికారిక గర్ల్‌ఫ్రెండ్” అనే నిబంధన బీసీసీఐ పాలసీలో ఎక్కడా లేదని, కేవలం భార్యలు, కుటుంబ సభ్యులకు మాత్రమే నిర్ణీత మార్గదర్శకాల ప్రకారం అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. యాంటీ కరప్షన్ యూనిట్ (ACU) అధికారులు సైతం కొందరు మహిళలను “అఫీషియల్ పార్ట్‌నర్స్” అని చెప్పగానే ఆటగాళ్లతో ఉండేందుకు ఎలా అనుమతించారనే కోణంలో విచారణ చేపట్టనున్నారని తెలిపారు. ఇక, త్వరలో జరగబోయే సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నప్పటికీ, ఈ నిబంధనను కేంద్ర నిబంధనగా మార్చి అన్ని జట్లకు వర్తింపజేయాలని బీసీసీఐ యోచిస్తోందట. కేవలం ఐపీఎల్‌లోనే కాకుండా, భారత జట్టు విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు సైతం ఈ రూల్స్ వర్తిస్తాయని.. ప్రయాణ, బస ప్రోటోకాల్స్‌కు సంబంధించి ఏసీయూ అధికారులకు సైతం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారట.