Reading Time: 2 minutes
Off The Record Over Kaleshwaram Commission 3

కాళేశ్వరం కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయి? హైకోర్ట్‌ తీర్పును తనకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్‌ ఉంటే…. సర్కార్‌ యాక్షన్‌ సంగతేటి? అసలు కోర్ట్‌ ఏం చెప్పింది…., ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది? కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ… నిగ్గు తేల్చేందుకు జస్టిస్‌ పీసీ ఘోష్ కమిషన్‌ వేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే… ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తాజాగా తీర్పు ఇచ్చింది రాష్ట్ర హైకోర్ట్‌. దీంతో… ఆ తీర్పుపై నెక్స్ట్‌ ఏం చేయాలా అన్న చర్చలు నడుస్తున్నాయి ప్రభుత్వంలో. అటు ప్రతిపక్షం బీఆర్ఎస్‌ జడ్జిమెంట్ తమకు అనుకూలంగా వచ్చిందని ప్రకటించుకుంది. ఇందులో మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఉన్నతాధికారులకు కూడా ఊరట లభించిందన్నది విపక్షం ఫీలింగ్‌. ఈ పరిస్థితుల్లో సర్కార్‌ చర్యలేంటన్నది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతానికైతే…. హైకోర్ట్‌ తీర్పుపై ప్రభుత్వం కూల్‌గానే ఉందట. ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని మాత్రమే కోర్ట్‌ చెప్పిందన్నది ప్రభుత్వ వాదన. అయినా…కాళేశ్వరంపై చర్యలు తీసుకోవడానికి కమిషన్‌ నివేదికనే ఆధారంగా తీసుకున్నామని మేం ఎక్కడా చెప్పలేదని కూడా అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఇప్పటికే NDSA, విజిలెన్స్ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రిపోర్టుల ఆధారంగా సాగునీటి శాఖ అధికారులపై చర్యలు తీసుకున్నారు. అలాగే… హైకోర్టులో కూడా కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఎక్కడా చెప్పలేదన్న సంగతి గుర్తు చేస్తున్నారు ఇరిగేషన్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి.

అయితే.. హైకోర్టు తీర్పుపై మంత్రివర్గంలో చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. హైకోర్టు తీర్పు వెలువడ్డ వెంటనే సీఎం రేవంత్… మంత్రి ఉత్తమ్ సమావేశమయ్యారు. అసలు ఘోష్‌ కమిషన్‌ నియామకాన్నే క్వాష్‌ చేయాలని బీఆర్ఎస్‌ కోరుకున్నా…. కోర్టులో అది సాధ్యం కాలేదన్నది గవర్నమెంట్‌ అభిప్రాయం. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై ఇప్పుడిక సీబీఐ దర్యాప్తు అంశాన్ని స్పీడప్ చేసే ఆలోచనలో చేస్తున్నట్టు తెలుస్తోంది. కేబినెట్‌లో చర్చించి అందరి అభిప్రాయాల ప్రకారం న్యాయ పోరాటం చేయడం ఇప్పుడు తెలంగాణ సర్కార్‌ ముందున్న ఫస్ట్‌ ఆప్షన్‌గా చెప్పుకుంటున్నారు. అసెంబ్లీలోనే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినా… అందులో ఎక్కడా ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా అని మెన్షన్ చేయలేదన్న సంగతి గుర్తు చేస్తోంది ప్రభుత్వం. అయితే… అటు బీఆర్ఎస్‌ మాత్రం కోర్ట్‌ తీర్పును రాజకీయంగా తనకు అనుకూలంగా మల్చుకునే పనిలో ఉంది. అదే సమయంలో అధికార పార్టీగా కాంగ్రెస్ కూడా అలాంటి ఎత్తుగడే వేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏ నివేదికతో సంబంధం లేకుండానే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినా… బీజేపీ బీఆర్ఎస్‌ను కాపాడే ప్రయత్నం చేస్తోందని, రెండు పార్టీల మధ్య దోస్తీ కుదిరిందన్న లైన్‌ తీసుకోబోతున్నట్టు సమాచారం. ఇలాంటి రకరకాల చర్చలు, పరిణామాల క్రమంలో కేబినెట్‌లో చర్చించాక యాక్షన్ ప్లాన్‌ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి పెరుగుతోంది. లీగల్గా ముందుకు వెళ్తారా? పొలిటికల్ ప్లానింగ్ ఎలా ఉంటుందని గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.