
టాలీవుడ్లో ‘సక్సెస్’ అనే పదానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. వరుసగా తొమ్మిది హిట్లు కొట్టి డబుల్ హ్యాట్రిక్ కి మించిన ఊపులో ఉన్న ఈ ‘హిట్ మెషీన్’, ఇప్పుడు విక్టరీ వెంకటేష్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ తో కలిసి ఒక భారీ మల్టీస్టారర్‌కు సిద్ధమవుతున్నారు. అయితే, ఈ సినిమా ఇంకా షూటింగ్ కూడా మొదలుపెట్టకముందే ఇండస్ట్రీని షేక్ చేసే రేంజ్ లో రికార్డులు సృష్టిస్తోంది. నిజానికి ఓటీటీ మార్కెట్‌లో ఒక విధమైన స్తబ్ధత నెలకొంది. పెద్ద పెద్ద సినిమాలకే డిజిటల్ రేట్లు ఆశించిన స్థాయిలో రావడం లేదని ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది కానీ, అనిల్ రావిపూడి బ్రాండ్ వ్యాల్యూ ముందు ఇవన్నీ పనిచేయడం లేదు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన వెనువెంటనే నాన్-థియేట్రికల్ డీల్స్ రూపంలో కళ్లు చెదిరే ఆఫర్లు వచ్చిపడుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా కేవలం నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారానే ఏకంగా ₹70 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. విశేషమేమిటంటే, ఇందులో మ్యూజిక్ రైట్స్ చేర్చలేదు. ఒక సినిమా ప్రారంభానికి ముందే ఈ స్థాయి బిజినెస్ జరగడం ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన గత చిత్రాలు ‘F2’, ‘F3’, సంక్రాంతికి వస్తున్నాం వంటివి బ్లాక్ బస్టర్ హిట్స్ కావడం అనిల్ చివరి మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు రీజినల్ రికార్డు కొట్టడంతో ఈ సినిమాపై బిజినెస్ వర్గాల్లో అపారమైన నమ్మకం నెలకొంది. ఇక షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి మేకింగ్ స్టైల్, మినిమమ్ గ్యారెంటీ హిట్స్ ట్రాక్ రికార్డ్ చూస్తుంటే, సాహు గారపాటి కెరీర్‌లోనే ఈ సినిమా అత్యధిక లాభాలను తెచ్చిపెట్టే ప్రాజెక్టుగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. దగుబాటి మరియు నందమూరి హీరోలు కలిసి నటిస్తుండటం సినిమాపై అంచనాలను పెంచేసింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో అనిల్ రావిపూడికి సాటిలేరు. ఆయన గత చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఇండస్ట్రీ హిట్ కావడంతో ఈ క్రేజ్ రెట్టింపు అయింది. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు, పండుగ సీజన్ అంటేనే అనిల్ రావిపూడి అడ్డాగా మారిపోయింది.