
CM Chandrababu: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సీఎం చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు.. నిడదవోలులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా రిజర్వేషన్ బిల్లుపై మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దేశానికి, మహిళలకు చేసిన పెద్ద విద్రోహమని వ్యాఖ్యానించారు.. కాంగ్రెస్ పార్టీతో పాటు వారి మిత్రపక్షాలు మహిళల ఆశలను ద్రోహం చేశాయని విమర్శించారు. ఇది క్షమించరాని నేరమని ఆయన అన్నారు. “మహిళల ఓట్లు అడగాలంటే ముందుగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలి. దానికి అడ్డుపడిన వారు రేపు ఏ మొఖంతో మహిళల దగ్గరకు వెళ్తారు?” అని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి 2029 నాటికి మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలనే సంకల్పం ప్రకటించారని, కానీ కాంగ్రెస్ పార్టీ దీనిని వక్రీకరించి ప్రజల్లో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
Read Also: Regina: కోల్పోయాకే దాని విలువ తెలిసింది.. రెజీనా కాసాండ్రా ఎమోషనల్ పోస్ట్ వైరల్!
దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పడం సరైంది కాదని, మహిళలందరూ ఈ బిల్లుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని అన్నారు చంద్రబాబు.. ఈ బిల్లును అడ్డుకోవడం తీరని ద్రోహమని మరోసారి స్పష్టం చేశారు. అలాగే, ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడా చర్చించినట్లు తెలిపారు. 2017లో టీడీపీ అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా తీర్మానం ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశంపై ప్రచారం చేపడతామని చెప్పారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు వివరిస్తామని, కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామని హెచ్చరించారు సీఎం చంద్రబాబు..
మహిళా రిజర్వేషన్ బిల్లుపై అనూహ్యంగా స్పందించిన చంద్రబాబు.. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిరసన ర్యాలీ నిర్వహించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా ఈ ర్యాలీ చేపట్టారు. హెలిప్యాడ్ నుంచి ‘స్వచ్ఛ్ ఆంధ్ర’ సభ వేదిక వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీడీపీ మరియు కూటమి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, “మహిళా బిల్లు అడ్డుకోవడం ద్రోహం” అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు తో పాటు ఈ ర్యాలీలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు డగ్గుబాటి పురందేశ్వరి (మాధవ్), మంత్రి కందుల దుర్గేష్, సోము వీర్రాజు, నిమ్మల రామానాయుడు తదితర కూటమి నేతలు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం మహిళలపై ద్రోహమని తీవ్రంగా వ్యాఖ్యానించారు.