Reading Time: 2 minutes
Women Reservation Bill Mps May Lose Seats Rahul Gandhi Rajnath Gadkari

మోడీ ప్రభుత్వం దేశ రాజకీయాల్లో కీలక సంస్కరణలు చేసే దిశగా వెళ్తోంది. మహిళలకు పెద్దపీట వేస్తూ సంచలన బిల్లును లోక్‌సభలోకి తీసుకురాబోతుంది. నారీమణులకు ఇదొక శుభపరిణామం. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులు ఆమోదించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే బిల్లులు ఆమోదించనుంది.

ఇక దేశంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తే లోక్‌సభలో రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. మహిళా ఓటర్ల శాతం ఆధారంగా నియోజకవర్గాలను రిజర్వ్ చేయాల్సి వస్తే కేంద్రంలో ఉన్న పలువురు అగ్ర నాయకులంతా తమ స్థానాలు కోల్పోయే ప్రమాదం ఉంది.

C

ఈ కోవలో కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ వంటి ప్రముఖులు తమ నియోజకవర్గాలను కోల్పోయే ప్రమాదం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కేంద్రం ప్రవేశపెడుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం.. లోక్‌సభలో 181 స్థానాలు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. వాటిలో కేవలం 26 స్థానాల్లోనే మహిళా ఎంపీలు ఉన్నారు. మిగతా 155 స్థానాల్లో కొత్త మార్పులు రానున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ (రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం), లక్నో (రాజ్‌నాథ్ సింగ్), అమేథీ వంటి నియోజకవర్గాలు మహిళా ఓటర్ల శాతం ఎక్కువగా ఉండడంతో ఈ స్థానాలు మహిళలకు రిజర్వ్ అయ్యే అవకాశముంది.

మహారాష్ట్రలో నాగ్‌పూర్ నియోజకవర్గం (నితిన్ గడ్కరీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం) కూడా మహిళా రిజర్వేషన్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే అనురాగ్ ఠాకూర్ (హమీర్‌పూర్), హెచ్‌డి కుమారస్వామి (మాండ్య), జితన్ రామ్ మాంఝీ (గయా), చంద్రశేఖర్ పెమ్మసాని (గుంటూరు), గౌరవ్ గొగోయ్ (జోర్హాట్), కళ్యాణ్ బెనర్జీ (శ్రీరాంపూర్) మరియు కీర్తి ఆజాద్ (బర్ధమాన్-దుర్గాపూర్) వరుసలో ఉన్నారు.

దక్షిణాది రాష్ట్రాలకు లాభం?
మహిళా ఓటర్ల శాతం దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండటంతో ఈ రాష్ట్రాలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల శాతం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది.