Reading Time: 2 minutes
Vaibhav Sooryavanshi Weakness Exposed Praful Hinges Perfect Plan Shocks Ipl 2026

Praful Hinge Exposed Vaibhav Sooryavanshi Weakness: ఐపీఎల్ 2026లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) తరఫున ఆడుతున్న వైభవ్.. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లలో 200 పరుగులు చేశాడు. 260కి పైగా అధిక స్ట్రైక్ రేట్‌తో రన్స్ చేయడం విశేషం. బౌలర్లకు పెను సవాల్‌గా మారుతున్న సమయంలో.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్) పేసర్ ప్రఫుల్ హింగే మొదటి బంతికే వైభవ్‌ను డకౌట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎస్‌ఆర్‌హెచ్ తరఫున అరంగేట్రం చేసిన హింగే.. ముందుగానే వేసుకున్న ప్లాన్‌ను చక్కగా అమలు చేసి వైభవ్‌ను గోల్డెన్ డక్‌గా ఔట్ చేయడం మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.

హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తాజాగా జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 217 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్ఆర్‌కు నిర్ధేశించింది. అందరూ వైభవ్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రఫుల్ హింగే మొదటి బంతికే అతడిని పెవిలియన్‌కు పంపించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన హింగే.. వైభవ్‌ను బౌన్సర్‌తో లేదా మరో విధంగా ఔట్ చేస్తానని తన సన్నిహితులకు ముందుగానే చెప్పానని వెల్లడించాడు. అతడు వ్యాఖ్యలు సిల్లీగా అనిపించినా.. అమలు చేయడం మాత్రం అంత ఈజీ కాదు. కానీ చెప్పినట్లే వైభవ్‌ను అవుట్ చేసి క్రికెట్ ప్రపంచానికి పరిచయం అయ్యాడు.

ప్రఫుల్ హింగే విజయానికి కారణం అతని లైన్-లెంగ్త్ కచ్చితత్వమే అని ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ చీఫ్ కోచ్ ఎం.సెంథిల్‌ నాథన్ చెప్పారు. ఆధునిక క్రికెట్‌లో బ్యాటర్ బలహీనతలను గుర్తించడం పెద్ద విషయం కాదని, కానీ వాటిని మైదానంలో అమలు చేయడం కీలకమని పేర్కొన్నారు. హింగే సరిగ్గా అదే చేశాడని ఆయన చెప్పారు. హై బ్యాక్‌లిఫ్ట్‌తో ఆడడం, ఫ్రంట్ లెగ్‌ను ముందుకేసి భారీ షాట్లు ఆడే ప్రయత్నం చేయడం వైభవ్ బలహీనత అని నిపుణులు అంటున్నారు. ఈ కారణంగా స్టంప్స్‌పై లేదా శరీరానికి దగ్గరగా వేసే బంతులకు అతడిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. హింగే అదే వ్యూహాన్ని అనుసరించి.. హార్డ్ లెంగ్త్ బంతితో అతడిని బోల్తా కొట్టించాడు.

హింగే మాదిరి ఇతర స్టార్ బౌలర్లు ప్రయత్నించినప్పటికీ.. అమలులో చిన్న తప్పిదాలు చేశారు. టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన బౌన్సర్ కొద్దిగా తక్కువలో రావడంతో వైభవ్‌కు టైమ్ దొరికింది. ఆసీస్ స్టార్ జోష్ హేజిల్‌వుడ్ వేసిన బంతి కూడా బ్యాటర్‌కు అనుకూలంగా వచ్చింది. కానీ హింగే మాత్రం తన లెంగ్త్‌ను కచ్చితంగా వేసి.. వైభవ్‌కు స్పేస్ ఇవ్వకుండా ఔట్ చేశాడు. వైభవ్‌ను హింగే అవుట్ చేసిన అనంతరం అందరిలో ఓ ప్రశ్న తలెత్తుతోంది. ఇకపై మిగతా బౌలర్లు కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించనున్నారు. బౌలర్లు వైభవ్‌ బలహీనతలను టార్గెట్ చేస్తే.. వాటిని అధిగమించి తిరిగి ఎలా రాణిస్తాడన్నది చూడాలి. ప్రతిభ ఎంత ఉన్నా.. కచ్చితమైన ప్లాన్, అద్భుతమైన ఎగ్జిక్యూషన్ ముందు ఏ బ్యాటర్ అయినా అవుట్ అకావాల్సిందే అని హింగే నిరూపించాడు.