Reading Time: 2 minutes
How Srhs Smart Plan Dismissed Vaibhav Sooryavanshi Varun Aaron And Praful Hinge Masterstroke

ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సొంత గడ్డపై రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం అందుకుంది. ఎస్‌ఆర్‌హెచ్ విజయంలో కెప్టెన్, కోచ్ వ్యూహలు కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఎలా ఔట్ చేయాలన్న దానిపై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేయడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్, అరంగేట్ర పేసర్ ప్రఫుల్‌ హింగే మధ్య జరిగిన చర్చే ఎస్‌ఆర్‌హెచ్ విజయానికి పునాది అయింది.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్.. రాజస్థాన్‌పై డెబ్యూ చేసిన ఇద్దరు బౌలర్లు ప్రఫుల్‌ హింగే, సకిబ్‌ హుస్సేన్‌తో ప్రత్యేకంగా మాట్లాడానని చెప్పాడు. ఆటను ఆస్వాదిస్తూ తమ సహజమైన గేమ్ ఆడాలని సూచించినట్లు తెలిపాడు. ఇలాంటి అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుందని, ఇద్దరు బౌలర్లు వచ్చిన నేపథ్యం దృష్ట్యా ఈ ప్రదర్శన గొప్పదని కొనియాడారు. అయితే వైభవ్‌ సూర్యవంశీని అవుట్ చేసిన క్రెడిట్ మాత్రం హింగేకే చెందుతుందని వరుణ్ ఆరోన్ స్పష్టం చేశాడు.

‘రాజస్థాన్‌ మ్యాచ్ ముందు ప్రఫుల్‌ హింగే నాతో మాట్లాడాడు. వైభవ్‌ సూర్యవంశీని ఔట్ చేసిన అనుభవం తనకు ముందే ఉందని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో కూడా ఔట్ చేస్తానని నమ్మకంగా చెప్పాడు. నేను కూడా అతడిని ప్రోత్సహించా. అయితే బౌలింగ్ యాంగిల్‌పై చిన్న సూచన చేశా. హింగే రౌండ్ ది వికెట్ బౌలింగ్ చేయాలనుకున్నాడు. ఓవర్ ది వికెట్ నుంచే బౌలింగ్ చేయమని నేను సూచించా. ఆ వ్యూహం మైదానంలో వర్కౌట్ అయింది. హింగే తన రెండో బంతికే సూర్యవంశీని ఔట్ చేసి మ్యాచ్‌కు ఊపు తెచ్చాడు. ఆ వికెట్ తర్వాత రాజస్థాన్ బ్యాటింగ్ కుప్పకూలింది. కొన్ని ఓవర్లలోనే కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడిపోయింది’ అని వరుణ్ ఆరోన్ తెలిపాడు.

Also Read: Saqib Hussain Debut: ఈ ప్రదర్శనను అస్సలు ఊహించలేదు.. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ప్రఫుల్‌ హింగే మొదటి ఓవర్‌లో వైభవ్‌ సూర్యవంశీతో పాటు ధృవ్ జురెల్, ప్రిటోరియస్ వికెట్లు తీసి రాయల్స్‌ను షాక్‌కు గురిచేశాడు. అనంతరం కెప్టెన్ రియాన్ పరాగ్ వికెట్ కూడా తీసి.. మొత్తం నాలుగు వికెట్లతో మ్యాచ్‌ను ఎస్‌ఆర్‌హెచ్ వైపు తిప్పాడు. అతని బౌలింగ్‌తో రాయల్స్ ఇన్నింగ్స్ పూర్తిగా వెనకపడిపోయింది. మరో ఎండ్‌లో యువ పేసర్ సకిబ్‌ హుస్సేన్‌ వికెట్ల వేట కొనసాగించాడు. యశస్వి జైస్వాల్, డోనోవన్ ఫెరీరా, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్ వికెట్లతో రాయల్స్ ఇన్నింగ్స్ ముగిసింది. 159 పరుగులకు రాజస్థాన్ ఆలౌట్ అయింది. స్పష్టమైన ప్లాన్, ఆటగాళ్లపై నమ్మకం ఈ విజయానికి కారణమయ్యాయి. సన్‌రైజర్స్ యువ బౌలర్లు చూపించిన ఈ ప్రదర్శన ఐపీఎల్ 2026లో ప్రత్యేకంగా నిలిచిపోనుంది.