
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ప్రాంతంలో ఉన్న భూదాన్ భూములు. బుల్డోజర్ అనే పదం కేవలం యంత్రాన్ని సూచించడం కాదు అది పాలనా విధానంపై ప్రశ్నగా మారింది. ఖమ్మం నగరం శివారు లోని వెలుగుమట్లలో ఫిబ్రవరి 26 న ఇస్తి రక్షణ అనే వాదనను ముందుకు తస్తీ మరోవైపు పేదల విధాన హక్కు అనే మౌలిక ప్రశ్నను లేవనెత్తింది. ముఖ్యంగా అక్కడ నివసిస్తున్న కుటుంబాలలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ వర్గాల వారు అధికంగా ఉన్నారన్న అంశం. బుల్డోజర్ గోడలను మాత్రమే కూల్చగలవు. కానీ ప్రజల నమ్మకాన్ని కూల్చితే తిరిగి నిర్మించడం కష్టం. ఖమ్మం వెలుగుమట్ల ఘటనను కేవలం పరిపాలనా చర్యగా కాకుండా చట్టపాలన సామాజిక న్యాయం మధ్య సమతుల్యంగా చూడాలి. వెలుగుమట్ల గ్రామ శివారులో సర్వే నంబర్లు 147, 118, 149లకు సంబంధించిన భూదాన్ భూముల విషయం ప్రత్యేకంగా పరిశీలించాల్సిన అంశంగా తీసుకుని భూదాన్‌భూములు సాధారణంగా భూమిలేని పేదలకు పంపిణీ చేయబడితే పట్టాదారు పుస్తకాల్లో అవి భూదాన్ భూములుగానే నమోదుగా ఉంటాయి.
స్థానికంగా అందుబాటులోనున్న సమాచారం ప్రకారం ఈ భూములు గతంలో నిరుపేదలకు కేటాయించినట్లు తెలుస్తుంది. దాదాపు కొన్ని ప్లాట్లుగా విభజించి నివాస అవసరాలకు వినియోగంలోకి వచ్చినట్లు ప్రస్తావనలు ఉన్నాయి. కేటాయింపులపై న్యాయస్థానాల్లో విచారణ జరిగి హైకోర్టు స్థాయిలో కూడా పరిశీలనలు జరిగినట్లు చెప్పబడుతోంది. ఇలాంటి పరిస్థితిలో ప్రస్తుత రికార్డుల స్థితి పూర్వనిర్ణయాల అమలు స్థాయి ప్రజలకు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. వెలుగుమట్ల ప్రాంతంలో భూదాన్ భూములపై ఇళ్లను కూల్చివేస్తున్న ఘటన స్థానికంగా ఉద్రిక్తతలకు దారితీస్తోంది. పునరావాసం కల్పించకుండా భూమిని స్వాధీనం చేసుకోవడం సరైందా? అనే ప్రశ్న అక్కడి ప్రజల మనసుల్లో తీవ్రంగా మ్రోగుతోంది. ఏళ్ల తరబడి నివసిస్తూ చిన్నచిన్న గుడిసెలను నిర్మించుకుని జీవిస్తున్న కుటుంబాలు ఒక్కసారిగా ఆశ్రయం కోల్పోవడం హృదయ విదారకంగా మారింది. వెలుగుమట్ల భూదాన్ పొలాల్లో నివసిస్తున్నవారు ఎక్కువగా దినసరి కూలీలు, చిన్న వ్యాపారులు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారు.
వారికి ఆ భూమి కేవలం మట్టికాదు అది జీవనాధారం, భద్రత, పిల్లల భవిష్యత్తు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయిస్తే, ముందుగా ప్రత్యామ్నాయ స్థలం లేదా పునరావాస పథకం ప్రకటించడం మానవతా ధర్మం. కానీ ప్రజల వాదన ప్రకారం స్పష్టమైన పునరావాస హామీ లేకుండానే కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. భూమి స్వాధీనంపై చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలులో పారదర్శకత ప్రజలతో చర్చ అవసరం. స్థానికులు చెబుతున్నదేమిటంటే సరైన నోటీసులు ఇవ్వకుండానే లేదా చర్చించకుండానే అధికారులు చర్యలకు దిగారని దీనివల్ల మహిళలు, పిల్లలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొన్ని కుటుంబాలు తాత్కాలికంగా బంధువుల ఇళ్లకు వెళ్లగా, మరికొన్ని కుటుంబాలు రోడ్లపైనే ఉండే పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అభివృద్ధి పేరుతో భూమిని అవసరమని భావిస్తే, అది ప్రజల ప్రయోజనాల కోసమే కావాలి. కానీ అభివృద్ధి ప్రయోజనాలు పేదల ప్రాణాధారాన్ని నాశనం చేస్తే అది సమగ్ర అభివృద్ధి కాదని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
పునరావాసం లేకుండా కూల్చివేతలు జరగడం రాజ్యాంగంలో ఉన్న సమానత్వం, జీవన హక్కు వంటి మూల్యాలకు విరుద్ధమని కొందరు న్యాయనిపుణులు సూచిస్తున్నారు. వెలుగుమట్ల ఘటన సామాజిక న్యాయంపై పెద్దచర్చకు దారితీస్తోంది. పేదల సమస్యలను ముందుగానే పరిష్కరించే విధంగా ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరించాలి. పునరావాసం, పరిహారం, ప్రత్యామ్నాయ గృహాలకల్పన వంటి అంశాలు స్పష్టంగా ప్రకటించి అమలు చేయడం అత్యవసరం. లేకపోతే ప్రజల నమ్మకం దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే ప్రజలతో చర్చించి, తగిన పునరావాస చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. భూమి స్వాధీన ప్రక్రియ చట్టబద్ధంగా, పారదర్శకంగా, మానవీయంగా జరగాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అభివృది, మానవ హక్కులు కలిసి నడవాలి గానీ ఒకటి మరొకటిని తుంచకూడదు. వెలుగుమట్లలో జరుగుతున్న ఈ పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పునరావాసం లేకుండా భూమి స్వాధీనం సరైందా? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడు అధికార యంత్రాంగం పైనే ఉంది. పేదల కన్నీళ్లకు తుడిచే చర్యలు తీసుకుంటేనే సమాజంలో న్యాయం నిలబడుతుంది.
– సొప్పరి నరేందర్
95539 58648