
దేశ భద్రత దృష్ట్యా అత్యంత ప్రాముఖ్యం సంతరించుకున్న ఈశాన్య రాష్ట్రం అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. దశాబ్దకాలంగా దూరమైన అధికారాన్ని అందుకోవడం కోసం కాంగ్రెస్ మిత్రపక్షాల ఇండియాకూటమి సర్వశక్తులను సమీకరిస్తున్నది. అధికారంలో ఉన్న బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ వరుసగా మూడవ విజయం కోసం వ్యూహరచన చేస్తున్నది. ఇటీవలి బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో అసోం విజయం మోడీ ప్రభుత్వానికి అత్యంత కీలకం కానుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే కాంగ్రెస్ 42 మంది అభ్యర్థులను ప్రకటించి దూకుడుతో ఉంది. బిజెపి మిత్రపక్షాల సీట్ల పంపిణీ చర్చల్లో తలమునకలై ఉంది. ఏ కూటమిలో లేని మిజోరం పీపుల్స్ మూవ్‌మెంట్ ఏలుబడిలో ఉన్న మిజోరం మినహా మిగతా ఆరు ఈశాన్య రాష్ట్రాలలో తిష్టవేసిన ఎన్‌డిఎ అదే జోరును ప్రదర్శిస్తున్నది. గత లోక్‌సభ ఎన్నికల్లో అసోంలోని 14 నియోజకవర్గాలకుగాను 11 చోట్ల విజయం సాధించింది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చూస్తే మొత్తం 126 స్థానాలకు గాను 92 చోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి కేవలం మూడు లోక్‌సభ స్థానాల్లో గెలుపొంది, కేవలం 34 సెగ్మెంట్లలో ఆధిక్యాన్ని కనపరిచింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అదే ఒరవడి కొనసాగుతుందన్న ఆత్మవిశ్వాసంతో అధికార ఎన్‌డిఎ ఉండగా ఎలాగైనా అసోంలో విజయంసాధించి ఇండియా కూటమికి ఈశాన్య ద్వారాలు తెరవాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కృతనిశ్చయంతో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, అస్సాం గణపరిషత్ యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ కలిసిన ఎన్‌డిఎ కూటమి 75 స్థానాలను సాధించగా కాంగ్రెస్ నాయకత్వంలో కమ్యూనిస్టులు తదితర ప్రాంతీయ పార్టీలు కలిసిన మహాజోత్ కూటమి 50 స్థానాలకే పరిమితమైంది. వాటిలో ప్రముఖ ముస్లిం నేత బద్రుద్దీన్ అజ్మల్ నాయకత్వంలోని ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ 16, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 4 సీట్లలో విజయం సాధించడం విశేషం. స్థానికంగా బలమైన ఈ రెండు ప్రాంతీయ పార్టీలు గత లోక్‌సభ ఎన్నికల్లో విడిగా పోటీచేసి ఏడు శాతం ఓట్లను సాధించాయి. ఆ ఎన్నికల్లో ఎన్‌డిఎ, ఇండియా కూటముల మధ్య ఓట్ల శాతాల తేడా అంతేకావడం గమనార్హం.
గత లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క అసోం జాతీయ పరిషత్ తప్ప మిగతా మిత్రపక్షాలు కాంగ్రెస్‌కు జల్లకొట్టి వేరు కుంపట్లు పెట్టుకున్నాయి. తిరిగి అదే కూటమి గూటికి చేరాలనుకుంటున్న ఆ మిత్రపక్షాలకు 100 సీట్లకు పోటీ చేస్తామని అసోం పిసిసి అధ్యక్షుడు మూడునెలల ముందుగానే కాలడ్డు పెట్టడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. 76 ఏళ్ల అసోం రాష్ట్ర చరిత్రలో 50 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ అధికారం కోల్పోయి 10 ఏండ్లయింది. గోరుచుట్టుపై రోకటి పోటులా పార్టీని వీడిపోతున్న నాయకగణం రాజీనామాల పరంపర. అన్నిటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి హిమంతబిశ్వశర్మకు దీటైన నాయకుడు కాంగ్రెస్‌కు లేకపోవడం పెద్దలోటు. గత లోక్‌సభ ఎన్నికల్లో దూరమైన మిత్రపక్షాలు ప్రత్యేకించి కమ్యూనిస్టులు ఎఐయుడిఎఫ్, బోడోలాండ్ కలిసి వస్తేనే కాంగ్రెస్ కూటమి విజయావకాశాలు మెరుగుపడతాయి. ఆలా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వేరుపడితే మోడీ సేనకు అసోం అసెంబ్లీ ఎన్నికలు నల్లేరు నడకే.
సంస్థాగతంగా, ప్రభుత్వపరంగా స్థిరంగా ఉన్నప్పటికీ ఎన్‌డిఎ కూటమికి రోహింగ్యాల సమస్య, బంగ్లాదేశీయుల చొరబాట్లు పెను సవాల్ విసురుతున్నాయి. 262 కిలోమీటర్ల పొడవైన బంగ్లా సరిహద్దు ద్వారా అసోంలోకి జరుగుతున్న చొరబాట్లు ఆ రాష్ట్రాన్నే కాదు దేశాన్నీ కలవరపరుస్తున్నాయి. దేశభద్రత సమగ్రత రీత్యా అసోంను ఆనుకొని ఉన్న అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం అత్యంత సున్నితమైన దేశ సరిహద్దు రాష్ట్రాలు. చైనా సరిహద్దుకు కేవలం 300- 450 కిలోమీటర్ల దూరంలో రక్షణ వ్యూహత్మక తేజ్‌పూర్ చెబువా ఏయిర్ బేస్‌లు అసోంలోనే ఉన్నాయి. అత్యంత కీలకమైన అసోం రాష్ట్రానికి పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌లో ఏడాదిన్నర క్రితం భారత్ స్నేహశీలి షేక్ హసీనా ప్రభుత్వ పతనం, అనంతరం అధికార పగ్గాలు చేపట్టిన మొహమ్మద్ యూనిస్ ప్రభుత్వం భారత్ పట్ల బద్ధ వ్యతిరేకతను ప్రదర్శించడం, ఆ దేశం మొత్తం మత ఛాందసవాదుల చేతుల్లో చిక్కుకుపోవడం వంటి వరుస పరిణామాలు ఆందోళన కలిగించాయి.
ఇటీవలి ఎన్నికల్లో మాజీ ప్రధాని ఖలీదాజియా తనయుడు తారీక్ రెహమాన్ అఖండ విజయం సాధించి పాలన పగ్గాలు చేపట్టడమే కాకుండా ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలకు ఆస్కారం లేని ప్రకటనలు చేయడం ఊరటనిచ్చింది. ప్రత్యర్థి అయిన షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించిన విషయంలోనూ తారీక్ రెహమాన్ ఆచితూచి స్పందించడం ఉభయ దేశాల మధ్య సయోధ్యకు శ్రీకారం చుట్టినట్లేనని దౌత్యవేత్తలు భావిస్తున్నారు. అయితే భారత వ్యతిరేక జమాతే ఇస్లామి సైతం బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. ఇటీవలి ఎన్నికల వరకు దేశాధినేతగా వ్యవహరించిన మహమ్మద్ యూనస్ పదవి నుంచి తొలగిపోతూ భారత్‌కు చెందిన ఏడు ఈశాన్య రాష్ట్రాలను అభ్యంతరకరంగా ప్రస్తావించడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. యూనస్ బంగ్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టవచ్చునన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
అదే నిజమైతే భవిష్యత్తులో బంగ్లా నూతన ప్రధాని తారీక్ రెహమాన్ భారత్ సానుకూల తటస్థ వైఖరిని యథాతథంగా కొనసాగిస్తారా లేక ప్రతిపక్ష జమాత్ ఏ ఇస్లామీ మహమ్మద్ యూనస్ ఒత్తిడికి లొంగిపోతారా చూడాలి. తీవ్ర వైరుధ్యాల నేపథ్యం లో సైతం భారత్ స్నేహ హస్తాన్ని చాచి గొప్ప దౌత్యనీతిని ప్రదర్శించింది. ఈ ఉద్విగ్న సందర్భంలో అసోం ముఖ్యమంత్రి హేమంత బిశ్వశర్మ లేవనెత్తిన ‘మియా ముస్లిం’ వివాదం అగ్గిరాజేసింది. బంగ్లా ముస్లింలను పనుల్లోకి తీసుకోవద్దన్న ఆ పిలుపును వ్యతిరేకించిన సంస్థలు న్యాయస్థానాల తలుపు తట్టాయి. మెడికల్ కాలేజీల్లో స్థానికుల కంటే చొరబాటు దారులే ఎక్కువగా కనిపిస్తున్నారని ఒకసారి, బంగ్లా చొరబాటుదారులను వెనకేసుకొస్తున్న పిసిసి అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ పాకిస్తాన్ ఏజెంట్ అంటూ ఆయా సందర్భాల్లో శర్మ చేసిన వ్యాఖ్యలు అలజడి సృష్టిస్తున్నాయి.
బంగ్లాదేశ్ ఏర్పడిన 1971 నుండి 55 ఏళ్లుగా చొరబాట్ల సమస్య తలెత్తుతూనే ఉంది. దాన్ని నిరసిస్తూ అసోంకు చెందిన విద్యార్థులు ఉద్యమించి అసోం గణ పరిషత్ పేర ఒక్క తాటిమీదికొచ్చి ఏకంగా 1985లో అధికారాన్ని చేపట్టడం ఆ రోజుల్లో ఒక సంచలనం. ముఖ్యమంత్రి సహా మంత్రులు సైతం విద్యార్థులే. రెండోసారి 1996లో అధికారంలోకి వచ్చిన అసోం గణపరిషత్ కూడా చొరబాట్లను నియంత్రించలేకపోయింది. గణ పరి షత్‌కు ముందు తర్వాత మూడు దశాబ్దాలు పరిపాలించిన కాంగ్రెస్ ఉదాసీన వైఖరి సమస్యను మరింత జటిలం చేసింది. అసోం భూమిపుత్రులకు అభద్రతా భావం పెరిగిపోయింది. మోడీ తొలిసారిగా ప్రధాని పగ్గాలు చేపట్టిన అనంతరం రెండేళ్లకు 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ విజయం సాధించి శర్వానంద్ సోనోవాల్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2021లో రెండవసారి విజయం సాధించి కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన హిమంత బిశ్వ శర్మకు పాలన పగ్గాలు అప్పగించింది.
1985లో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ సమక్షంలో విద్యార్థి నాయకులకు ప్రభుత్వానికి మధ్య కుదిరిన అసోం ఒప్పందం పటిష్టంగా అమలు జరగలేదని ఆ రాష్ట్ర ప్రజలు అనుమానిస్తున్నారు. 1971 తర్వాత అసోంలో ప్రవేశించిన బంగ్లాదేశ్ చొరబాటుదారులను గుర్తించి వెనక్కి పంపడం, నదీ అటవీ భూమార్గ గస్తీలను పటిష్టం చేసి సరిహద్దు వెంబడి పూర్తిగా కంచె నిర్మించాలన్న ఒప్పందం కార్యరూపం దాల్చాలని అసోమీయులు కోరుకుంటున్నారు. ఎన్‌ఆర్‌సి, సిఎఎ పకడ్బందీగా రూపొందించాలని వారు ఆశిస్తున్నారు. ఆ దిశగా కాంగ్రెస్ సుదీర్ఘ పాలనలో ఆశించిన స్థాయిలో పనులు జరగలేదని ఆగ్రహించిన అసోం ప్రజలు ప్రత్యామ్నాయంగా పదేళ్ల క్రితం ఎన్‌డిఎ వైపు మొగ్గుచూపారు. బంగ్లాదేశ్‌కు మరో వైపు ఉన్న సరిహద్దు రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు కూడా అసోం అసెంబ్లీ ఎన్నికలతోపాటు జరగనున్నాయి. రెండు రాష్ట్రాల ఎన్నికల ఎజెండాలో అభివృద్ధి సంక్షేమాల కంటే బంగ్లాదేశీయుల చొరబాట్ల సమస్య ప్రధానమై ముందు నిలిచింది. ఈ వ్యవహారంలో మోడీ విధానాలను ఎదిరించడంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సరిపోల్చదగిన నాయకులు అసోం ఇండియా కూటమికి లేకపోవడం ఎన్‌డిఎకు కలిసొస్తున్న అంశం.