Reading Time: 2 minutes

టెల్ అవీవ్ : ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రసంగించడం తనకు దక్కిన గౌరవం, గర్వకారణం అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఉగ్రవా దం ఏ రూపంలో ఉన్నా అది మానవాళికి ప్రమాదకరమే అని ప్రదాని మోడీ చెప్పారు. పరోక్షంగా ఇజ్రాయెల్‌లో రెండేళ్ల క్రితం హమాస్ నర మేధాన్ని ఖండించారు. ఉగ్రవాదం, హింసోన్మాదంపై ఇజ్రాయెల్ జ రిపే పోరులో భారతదేశం ఎప్పుడూ తోడుగా ఉంటుందని ప్రకటించా రు. స భ్యులను ఉద్ధేశించి తొలుత హిబ్రూ బాషలో షలోమ్ అని వారికి అభివాదాలు చేశారు. సామరస్యం, సోదరభావం అభివాదాలకు సూచకంగా ఈ పదం వాడుతారు . ఇజ్రాయెల్‌కు తమ దేశ మద్దతు ఇకపై కూడా నిబద్ధతతో సాగుతుందని వెల్లడించారు. ఇది కాలాతీతంగా ఉంటుందన్నారు. ఇజ్రాయెల్ భూభాగంలోకి హమాస్ బలగాలు చొరబడి పౌరుల ప్రాణాలు తీసిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పటి ఘటనలో మృతి చెందిన వారికి భారతదేశ ప్రజల తరఫున సంతాపం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. హమాస్ దాడిని అనాగరికం, అమానుషం అని పేర్కొన్నారు. ఇక్కడి పార్లమెంట్‌లో ప్రసంగించే అవకాశం కల్పించినందుకు ఇక్కడి నేతలకు, ఎంపిలకు కృతజ్ఞతలు అని తెలిపారు.

భారత్, ఇజ్రాయెల్ రెండూ ప్రాచీన విశిష్ట నాగరికతల దేశాలని, ఇది రెండు దేశాల స్నేహబంధం పూర్వ చరిత్ర అని పేర్కొన్నారు. రెండు రోజుల ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ తొలిరోజే బుధవారం ఇజ్రాయెల్ పార్లమెంట్ నెసెట్‌లో ఎంపిలను ఉద్ధేశించి ప్రసంగించారు. తాను ఇక్కడికి 140 కోట్ల మంది భారతీయుల శుభాకాంక్షలను తీసుకుని వచ్చానని సభికుల హర్షధ్వానాల మధ్య తెలిపారు. అదే విధంగా స్నేహం, ఆదరణభావం, భాగస్వామ్యం అనే మూడు కానుకలను అందించేందుకు వచ్చానని తెలిపారు. పలు దశల్లో అనేక కష్టాలు పడ్డ యూదులకు సంఘీభావంగా ఉంటామlన్నారు. ఇదే సమయంలో పాలస్తీనియా సమస్యలపై స్పందించాల్సిన సమయం కూడా వచ్చిందన్నారు. ఇక తాను పుట్టిన తేదీకి విశేషం ఉందని, ఇజ్రాయెల్‌ను భారతదేశం గుర్తించిన రోజే తాను జన్మించానని కూడా వెల్లడించారు. ఇజ్రాయెల్‌తో భారత్ సుదీర్ఘ బంధం గురించి తెలిపారు. భారతదేశ ప్రధాని ఒక్కరు ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో మాట్లాడటం ఇదే తొలిసారి అయింది. ఇజ్రాయెలీ నేలతో భారతదేశ సంబంధాల పూర్వరంగం అత్యంత పురాతనం. ఇది రక్త సంబందం అని సభికుల మోడీ మోడి నినాదాల నడుమ చెప్పారు. నెత్తురు, త్యాగాల సమ్మిళిత అనుబంధం అన్నారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఈ ప్రాంతంలోనే దాదాపుగా 4 వేల మంది భారతీయులు , పలు కులాలకు చెందిన వారు సైనికులుగా ఇక్కడ హైఫా యుద్ధంలో నెత్తురు చిందించారు. ప్రాణాలు వదిలారని వెల్లడించారు.

ప్రధాని మోడీ ప్రసంగానికి ముందు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు సంక్షిప్తంగా మాట్లాడారు. అతిధి గురించి పార్లమెంట్‌కు అధికారికంగా తెలిపారు. భారతదేశం ఇజ్రాయెల్‌కు వెంట నిలిచింది. ఇజ్రాయెల్‌కు తోడుగా నిలిచింది. సత్యం కోసం పాటుపడింది. స్నేహితుడు మోడీకి ధన్యవాదాలు అని నెతన్యాహు తెలిపారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి ఘటనను భారతదేశం ఖండించిన విషయం ప్రస్తావించారు. ప్రధాని మోడీ ప్రసంగాన్ని ఇజ్రాయెల్ ప్రతిపక్షం కూడా శ్రద్ధగా ఆలకించింది. అంతకు ముందు పార్లమెంట్ నుంచి వాకౌట్ జరిపిన ప్రతిపక్ష ఎంపిలు ప్రధాని మోడీ ప్రసంగం దశలో లోపలికి వెళ్లారు. పార్లమెంట్ స్పీకర్ అమీర్ ఒమానా అంతకు ముందు ప్రధాని మోడీకి ఆప్ కా స్వాగత్ హై అని పలకరించారు.