Reading Time: < 1 minute

రాంచీ: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాట్‌ని ఝుళిపించాడు. విజయ్ హజరే ట్రోఫీలో బిహార్ తరఫున ఆడుతున్న ఈ 14 ఏళ్ల కుర్రాడు చరిత్ర సృష్టించాడు. అరుణాచల్‌ప్రదేశ్‌తో రాంచీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సూపర్ సెంచరీతో చెలరేగిపోయాడు. తృటిలో డబుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 36 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను చేరుకున్న వైభవ్.. మొత్తం 84 బంతుల్లో 16 ఫోర్లు, 15 సిక్సులతో 190 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. వైభవ్‌తో పాటు కెప్టెన్ సకిబుల్ గని(128), కీపర్ ఆయుష్ లోహరుకా(116) సెంచరీలతో రాణించడంతో బిహార్ 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 574 పరుగుల భారీ స్కోర్‌ను సాధించింది.

ఈ క్రమంలో వైభవ్ సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఎబి డివిలియర్స్ రికార్డును బద్దలుకొట్టాడు. 2015లో డివిలియర్స్ 64 బంతుల్లో 150 పరుగుల మార్క్‌ని దాటగా.. తాజాగా వైభవ్ లిస్ట్ ఎ క్రికెట్‌లో కేవలం 59 బంతుల్లోనే 150 పరుగులు చేశాడు. అలాగే లిస్ట్ ఎ క్రికెట్‌లో అత్యంత పిన్న వయస్సులో(14 సంవత్సరాల 272 రోజులు) సెంచరీ చేసిన బ్యాటర్‌గా వైభవ్ చరిత్ర సృష్టించాడు.