Reading Time: < 1 minute
Ap Rain Alert Rainfall Expected In 13 Districts In Next 24 Hours

AP Weather Update: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) వెల్లడించింది. మధ్యప్రదేశ్, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర విదర్భ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది. ఈ అల్పపీడనం రాబోయే 24 గంటల్లో రాజస్థాన్, గుజరాత్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వాతావరణ ప్రభావంతో సోమవారం (సెప్టెంబర్ 14) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది.

ముఖ్యంగా మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ వెల్లడించింది. వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. పిడుగులు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా చెట్ల కింద, హోర్డింగ్స్ సమీపంలో నిలబడవద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. శనివారం ఉదయం 8.30 గంటల నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు నమోదైన వర్షపాత వివరాలను ఏపీఎస్‌డీఎంఏ వెల్లడించింది. కృష్ణా జిల్లా పెనమలూరులో అత్యధికంగా 100.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో 97.6 మిల్లీమీటర్లు, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 94.2 మిల్లీమీటర్లు, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో 90.8 మిల్లీమీటర్లు, బాపట్ల జిల్లా మార్టూరులో 90.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.