
భోపాల్: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఫౌండర్ అభిజిత్ దీప్కేకు మధ్యప్రదేశ్లో చేదు అనుభవం ఎదురైంది. బాలాఘాట్ జిల్లాలో ఇన్ఫెక్షన్ల వల్ల మరణించిన గిరిజన చిన్నారుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన అతడిని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. పిల్లల మరణాలపై రాజకీయాలు చేసేందుకు వచ్చారా అని దీప్కేను నిలదీశారు.
పిల్లలు అనారోగ్యంతో ఎప్పుడో చనిపోతే ఇంతా ఆలస్యంగా పరామర్శకు రావడం వెనక మతలబు ఏంటని ఒక మహిళా ఇన్ఫ్లూయెన్సర్ ప్రశ్నించింది. దీనికి రియాక్ట్ అయిన దీప్కే.. ఆలస్యంగా వచ్చిందనకు సారీ చెప్పాడు. గిరిజన ప్రాంతాలకు కూడా ప్రభుత్వం మెరుగైన రోడ్లు వేసిందని.. ఇంత మంచి రోడ్లు మీకు కనిపించడం లేదా అని నిలదీశారు.
ఈ క్రమంలో సీజేపీ కార్యకర్తలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లకు మధ్వ వాగ్వాదం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా సీజేపీ మద్దతుదారులు దీప్కేను మరో కారులో అక్కడి నుంచి తరలించారు. దీంతో దీప్కే భయపడి పారిపోయాడంటూ ఇన్‌ఫ్లుయెన్సర్లు నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు.
ఇటీవల బాలాఘాట్ ప్రాంతంలో ఇన్ఫెక్షన్ల వల్ల దాదాపు 30 మందికి పైగా గిరిజన పిల్లలు మరణించారు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన మధ్యప్రదేశ్ హైకోర్టు జబల్పూర్ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పిల్లల మరణాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించేందుకు సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే బాలాఘాట్ ప్రాంతంలో పర్యటించారు. ఈ క్రమంలో దీప్కేతో పాటు సీజేపీ బృందాన్ని కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు అడ్డుకోవడం గమనార్హం.