
Varanasi Set Leak: దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజీ కాంబోపై ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతటి ఆసక్తితో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న అడ్వెంచరస్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (#Varanasi) చుట్టూ రోజుకో ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తూనే ఉంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్ నుంచి బయటకు వచ్చినట్లు చెబుతున్న ఒకే ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఊహకందని కాన్సెప్ట్‌తో జక్కన్న రెడీ చేస్తున్న సరికొత్త విజువల్ వండర్ ఇదేనంటూ నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. సాధారణంగా లీకయ్యే ఫోటోల్లో హీరో లుక్ లేదా లొకేషన్ సెటప్ కనిపించడం నార్మల్. కానీ ‘వారణాసి’ సెట్ నుంచి లీకైన పిక్ మాత్రం ఎవరూ కలలో కూడా ఊహించని సరికొత్త సంచలనానికి తెరలేపింది. పురాతన కళావైభవంతో నిర్మించిన భారీ ఆలయ నేపథ్యం.. సరిగ్గా అదే ప్రాంగణంలో కళ్లు చెదిరే సైజులో కనిపిస్తున్న ఓ భారీ డైనోసార్ ఆకారం. ఈ వింత కలయిక చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు తలపట్టుకుంటున్నారు. దైవత్వానికి ప్రతీకగా నిలిచే ఒక పవిత్ర దేవాలయ సెట్‌లో, చరిత్ర పూర్వ యుగానికి చెందిన భయంకర డైనోసార్ ఏం చేస్తోందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
రాజమౌళి ఆలోచనలు ఎప్పుడూ రొటీన్ ఫార్ములాకు పూర్తి భిన్నంగా ఉంటాయి. ఫారెస్ట్ అడ్వెంచర్ స్టోరీతో సాగే ఈ ప్రాజెక్ట్‌లో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఉందా? లేక మన పురాణాలలోని అంతుచిక్కని రహస్యాలను, డైనోసార్ల కాలం నాటి పరిణామ క్రమాన్ని ముడిపెడుతూ ఏమైనా సరికొత్త కథ అల్లుతున్నారా? అనే సరికొత్త చర్చలను నెటిజన్లు తెరపైకి తెస్తున్నారు. ఇండియానా జోన్స్ తరహా గ్లోబల్ అడ్వెంచర్‌గా ప్రచారం అవుతున్న ఈ చిత్రంలో మైథాలజీతో పాటు సైన్స్ ఫిక్షన్‌ను కూడా జక్కన్న సమపాళ్లలో మిళితం చేస్తున్నారనే ఊహాగానాలకు ఈ లీక్ మరింత బలాన్నిచ్చింది. ఇప్పటికే భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రాజెక్టుల్లో ముందు వరుసలో నిలుస్తున్న ఈ సినిమాపై తాజా లీక్‌తో హైప్ పతాక స్థాయికి చేరింది. హాలీవుడ్ స్థాయి విజువల్స్, అడ్వెంచర్‌కు మన నేటివిటీని జోడించడంలో రాజమౌళి స్టైలే వేరు. ఆలయం బ్యాక్‌డ్రాప్‌లో డైనోసార్ దృశ్యం వెండితెరపై ఎలా ఆవిష్కృతం కాబోతోందో ఊహించుకోవడానికే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయంటూ మహేష్ బాబు అభిమానులు సంబరపడిపోతున్నారు. అధికారికంగా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అప్‌డేట్ రాకపోయినా, ఈ ఒక్క లీక్డ్ పిక్ మాత్రం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద మహేష్ – జక్కన్న సృష్టించబోయే విధ్వంసానికి ట్రైలర్‌లా మారిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.