Reading Time: 2 minutes
Delhi Capitals Ipl 2027 Sourav Ganguly Yuvraj Singh In Coaching Staff

IPL 2027 Delhi Capitals Head Coach: ఐపీఎల్ 2027 సీజన్ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించాయి. జట్లను బలోపేతం చేయడంతో పాటు కోచింగ్, సపోర్ట్ స్టాఫ్‌లోనూ కీలక మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) భారీ ప్రక్షాళనకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీమిండియా స్టార్ రిషభ్ పంత్‌ను తిరిగి జట్టులోకి తీసుకొచ్చిన డీసీ.. ఇప్పుడు కోచింగ్ విభాగంలోనూ స్టార్ మాజీ క్రికెటర్లకు చోటు కల్పించబోతున్నట్లు సమాచారం.

ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ నిర్వహణలో ఓ ప్రత్యేక విధానం ఉంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి సహ యజమానులైన జీఎంఆర్ గ్రూప్, జిందాల్ గ్రూప్‌ల మధ్య నిర్వహణ బాధ్యతలు మారుతుంటాయి. గత రెండు సీజన్లలో జీఎంఆర్ గ్రూప్ నిర్వహణను చూసుకుంది. ఆ సమయంలో హెమంగ్ బదానీని హెడ్ కోచ్‌గా నియమించడంతో పాటు సపోర్ట్ స్టాఫ్‌లోనూ పలు మార్పులు చేసింది. ఇప్పుడు తదుపరి రెండేళ్లకు జిందాల్ గ్రూప్ నిర్వహణ బాధ్యతలు చేపట్టడంతో.. కోచింగ్ బృందంలోనూ మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పుల్లో భాగంగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి రానున్నట్లు సమాచారం.

స్పోర్ట్‌ స్టార్ నివేదిక ప్రకారం.. సౌరవ్ గంగూలీ ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న హెమంగ్ బదానీ స్థానంలో దాదా వచ్చే అవకాశం ఉంది. క్యాపిటల్స్‌తో గంగూలీకి ఇప్పటికే మంచి అనుబంధం ఉంది. గతంలో ఆయన డైరెక్టర్ ఆఫ్ క్రికెట్, మెంటార్‌గా సేవలందించారు. అయితే గత రెండు సీజన్లలో మాత్రం జట్టు వ్యవహారాల్లో ఆయన భాగం కాలేదు. భారత క్రికెట్ దిగ్గజం, ప్రపంచకప్ విజేత యువరాజ్ సింగ్ కూడా ఢిల్లీ కోచింగ్ బృందంలో చేరనున్నట్లు తెలుస్తోంది. యువీని అసిస్టెంట్ కోచ్‌గా నియమించే అవకాశముంది. ఐపీఎల్‌లో ఆటగాడిగా అద్భుత అనుభవం ఉన్న యువరాజ్‌కు కోచ్‌గా ఇదే తొలి బాధ్యత కానుంది. గంగూలీ, యువరాజ్ వంటి దిగ్గజాలు ఒకే కోచింగ్ బృందంలో ఉండటం క్యాపిటల్స్‌కు మరింత స్టార్ పవర్‌ను తీసుకురానుంది.

బౌలింగ్ విభాగంలోనూ ఢిల్లీ క్యాపిటల్స్ కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం. శ్రీలంక మాజీ పేస్ బౌలింగ్ దిగ్గజం చమిందా వాస్‌ను ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించనున్నట్లు తెలుస్తోంది. వాస్‌కు ఐపీఎల్‌లోనూ అనుభవం ఉంది. డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఐపీఎల్ తొలి మూడు సీజన్లలో ఆడిన ఆయన 13 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టారు. భారత మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రాను స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఢిల్లీ తరఫున ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లోనూ ఆడిన మిశ్రాకు సుదీర్ఘ అనుభవం ఉంది. ఈ నియామకాలపై క్యాపిటల్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ మార్పులు ఖరారైతే గంగూలీ, యువరాజ్, వాస్, అమిత్ మిశ్రా వంటి అనుభవజ్ఞులతో కూడిన కోచింగ్ బృందం ఢిల్లీకి కొత్త దిశను చూపించే అవకాశం ఉంది.