Reading Time: < 1 minute
Russia Offers India Ivolga High Speed Train With 360 Kmph Speed

Ivolga high-speed train: భారత్ తన పాతకాలపు రైల్వే వ్యవస్థను ఆధునీకీకరించే పనిలో ఉంది. ఈ నేపథ్యంలోనే వందేభారత్, వందే భారత్ స్లీపర్, నమో భారత్, బుల్లెట్ ట్రైన్ వంటి ప్రాజెక్టుల్ని తీసుకువచ్చింది. ఇదిలా ఉంటే, రష్యా తనక హై-స్పీడ్ ట్రైన్ టెక్నాలజీని భారత్‌కు ఇచ్చేందుకు ప్రతిపాదించింది. ఇన్నోప్రోమ్.ఇండియా కార్యక్రమంలో ఈ ప్రతిపాదనను సమర్పించినట్లు తెలుస్తోంది. రష్యాకు చెందిన ట్రాన్స్‌మాష్ హోల్డింగ్ సంస్థ తన ‘‘ఇవోల్గా హై స్పీడ్ రైలు’’ను భారత్‌కు ఇవ్వాలనుకుంటోంది.

గంటలకు 360 కి. మీ వేగం..

రష్యా ప్రతిపాదించిన ఇవోల్గా హైస్పీడ్ రైలు గంటకు 360 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. 8 బోగీలు ఉండే ఈ రైలు 642 మంది ప్రయాణికుల్ని తీసుకెళ్తుంది. దీని జీవిత కాలం 30 ఏళ్లు. ఈ రైలు సుమారు 80 శాతం స్థానిక పరికరాలు ఉపయోగించిన నిర్మించవచ్చని రష్యా ప్రతిపాదించింది. టెక్నాలజీ బదిలీ, స్థానిక తయారీకి అవకాశం కల్పిస్తే ఇది భారత్ చేపడుతున్న ‘‘మేక్ ఇన్ ఇండియా’’, ‘ఆత్మ నిర్భర భారత్’’ లక్ష్యాలను నెరవేర్చినట్లు అవుతుంది.

వందే భారత్‌లో భారత్‌లోకి ఎంట్రీ..

ట్రాన్స్‌మాష్ హోల్డింగ్ ఇప్పటికే భారత రైల్వే రంగంలో భాగస్వామిగా ఉంది. వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీలో భారత్‌తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 120 వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీ ఒప్పందం కుదిరింది. ఈ అనుభవం ఆధారంగా రష్యా ఇప్పుడు భారత్‌కు హై స్పీడ్ రైలును ఆఫర్ చేస్తోంది.

మౌలిక సదుపాయాలు ముఖ్యమే..

హైస్పీడ్ రైలు పరుగులు తీయాలంటే దానికి అనుగుణంగా రైల్వే ట్రాక్, సిగ్నలింగ్ వ్యవస్థ, విద్యుదీకరణం, భద్రతా ప్రమాణాలు, నిర్వహణ ఇలా అన్నింటిని చూసుకోవాల్సి ఉంటుంది. హైస్పీడ్ రైళ్లకు తగ్గట్లుగా ట్రాక్ మార్పులు చేయాల్సి ఉంటుంది. దీంతో రష్యా ప్రతిపాదనను భారత్ అంగీకరించే ముందు రైలు వేగంతో పాటు మొత్తం ప్రాజెక్టు వ్యయం, భద్రత, నిర్వహణ, స్థానిక తయారీ, టెక్నాలజీ బదిలీ వంటి అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది.

ఒక వేళ ఇవోల్గా ప్లాన్ కార్యరూపం దాలిస్తే భారత్-రష్యా సహకారం ఇప్పుడు రైల్వేకు విస్తరించినట్లు అవుతుంది. రైళ్లను నేరుగా దిగుమతి చేసుకోకుండా స్థానికంగా ఉత్పత్తి చేయడం వల్ల భారతీయ పరిశ్రమలకు సాంకేతికంగా కలిసి వస్తుంది. ఇక్కడ ఉద్యోగాలు, ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది.