Reading Time: 2 minutes
Revanth Reddy Arya Vysya Atma Gourava Bhavan Uppal Bhagath

హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్యుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ వేడుకకు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి టీజీ వెంకటేష్, ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త, బండారి లక్ష్మారెడ్డి, ప్రకాష్ గౌడ్, మల్ రెడ్డి రంగా రెడ్డి, నవీన్ యాదవ్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త, మాజీ ఎంపీ మధు యాష్కీతో పాటు పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన ఆర్యవైశ్యుల ఆత్మగౌరవ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.

ఆర్యవైశ్యులు ఆత్మాభిమానం కలిగిన సౌమ్యులు

ఆర్యవైశ్యులు ఎంతో సౌమ్యులని, సమాజంలో అత్యంత ఆత్మాభిమానంతో జీవించే స్వభావం కలవారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆర్యవైశ్యుల్లో చాలా మంది పేదవారు ఉన్నప్పటికీ, ఆత్మగౌరవానికి ప్రాధాన్యమిస్తూ తమను పేదలుగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఇష్టపడరని పేర్కొన్నారు. ఎంతటి కష్టాలు, బాధలు ఎదురైనా సమాజంలో గౌరవాన్ని కాపాడుకుంటూ జీవించడం ఆర్యవైశ్యుల నైజమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతటి పేదవారు మరణించినా కనీస అవసరాల కోసం అప్పు ఇచ్చే గుణం, ఊరిలో ఏ శుభకార్యం జరిగినా మొదట గుర్తుకొచ్చేది ఆర్యవైశ్య సోదరులేనని అన్నారు. ప్రపంచంలో వ్యవసాయం, వ్యాపారం అనేవి రెండే ప్రధాన వృత్తులని, నాటి నుంచి నేటి వరకు తాను ఎప్పుడూ ఆర్యవైశ్యుల శ్రేయోభిలాషినేనని సీఎం స్పష్టం చేశారు.

రోశయ్య సేవలు , కాంగ్రెస్ ప్రాధాన్యత

గతంలో చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి మాజీ ముఖ్యమంత్రులు ఆర్థిక శాఖ వంటి కీలక బాధ్యతలను ఆర్యవైశ్యులకే అప్పగించారని సీఎం గుర్తుచేశారు. జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటికి రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఏర్పడిందంటే దానికి నాటి ఆర్థిక మంత్రి కె. రోశయ్యే ప్రధాన కారణమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రోశయ్యకు తగిన అవకాశం, గౌరవం ఇచ్చిందని తెలిపారు. శాసనమండలిలో తాను ఆవేశంగా మాట్లాడిన సందర్భాల్లో రోశయ్య తనను పిలిచి ఆవేశం తగ్గించుకుని అనుభవంతో ముందుకు వెళితే ఉన్నత స్థాయికి చేరుకుంటావని ఆశీర్వదించారని సీఎం గుర్తుచేసుకున్నారు. రోశయ్య ఎవరినీ విమర్శించకుండా చురకలు వేసేవారని, ఆయన మాటలను గౌరవిస్తూనే హైదరాబాద్ నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు.

గాంధీజీ, పొట్టి శ్రీరాములు త్యాగాలు

ప్రపంచస్థాయి నేతగా గుర్తింపు పొందిన మహాత్మా గాంధీ ఆర్యవైశ్య బిడ్డ కావడం, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావడం గర్వకారణమని రేవంత్ రెడ్డి అన్నారు. దేశ సమగ్రత కోసం మహాత్మా గాంధీ ప్రాణాలు అర్పిస్తే, పొట్టి శ్రీరాములు చేసిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. అనేక మంది ఆర్యవైశ్య ప్రముఖులు కాంగ్రెస్ పార్టీతో పాటు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని, అయితే వారికి రావాల్సినంత గుర్తింపు రాలేదని అభిప్రాయపడ్డారు.

ఆర్యవైశ్యులకు ప్రభుత్వ మద్దతు – ఐక్యతపై పిలుపు

ఆర్యవైశ్యుల పట్ల తమ ప్రభుత్వానికి సంపూర్ణ విశ్వాసం ఉందని, ఉప్పల్ భగాయత్‌లో నిర్మించబోయే ఆత్మగౌరవ భవనం పేద ఆర్యవైశ్యుల సంక్షేమానికి సంపూర్ణంగా ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ఈ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీల్లో పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులతో ఇప్పటికే రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చామని, రాజకీయాల్లో ఆర్యవైశ్యులు తమ వాటాను దక్కించుకోవాలని సూచించారు. ఆర్యవైశ్యుల డీఎన్‌ఏలోనే ముందుచూపు, జాగ్రత్త ఉన్నాయని, అందరూ కలిసికట్టుగా, సమైక్యంగా ఒకే తాటిపై నడిచినప్పుడే బలం పెరుగుతుందని ఐక్యతను చాటాలని సీఎం పిలుపునిచ్చారు.