
స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. స్పీకర్ పదవికి ఉన్న రాజ్యాంగ గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు.స్పీకర్‌పై వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. దళితులపై జరిగిన అవమానకర ఘటనకు బీఆర్‌ఎస్ నాయకత్వం సమాధానం చెప్పాలని అన్నారు.
దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే చర్యలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దళితులంతా ఐక్యంగా ఉంటేనే తమ హక్కులను సాధించుకోగలరని అన్నారు.కేసీఆర్‌ను ఉద్దేశించి అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్‌కు ఉన్న కుల బలం ఎంత? దళితుల కుల బలం ముందు కేసీఆర్ ఏ మాత్రం సరిపోతారు? అని ప్రశ్నించారు. దళితులతో కావాలనే కేసీఆర్ గోక్కుంటున్నారని విమర్శించారు. దళితులు అడుగుపెట్టిన భూమిని శుద్ధి చేయడం అంటే మనం ఏ నాగరికతలో ఉన్నామని ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
సీఎం పదవి కేసీఆర్ కుటుంబానికి రాసి పెట్టారా అని ప్రశ్నించారు.ఏళ్ల తరబడి దొరలకు మేము గులాం చేయాలా? అని అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. దళితుల జోలికి వస్తే కేసీఆర్ చరిత్రహీనులవుతారని హెచ్చరించారు.గతంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చి కేసీఆర్ మాట తప్పారని ఆరోపించారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీఆర్‌ఎస్ నేతల్లో ఏమాత్రం బాధ కనిపించడం లేదని అద్దంకి దయాకర్ విమర్శించారు.