Reading Time: 2 minutes
IND vs AFG: నేడు భారత్ – ఆప్ఘాన్ పోరు.. ఇక్కడ 250 పరుగులు చేసినా గెలవడం కష్టమే

IND vs AFG: భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య తొలి టీ20 పోరు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. చిన్న బౌండరీలు ఉన్న ఈ మైదానంలో 250కి పైగా పరుగులు సాధించినా గెలుస్తామనే ధీమా ఉండని పరిస్థితి నెలకొంది. నేటి మ్యాచ్‌లో ఇరు జట్ల వైపు నుంచి పరుగుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం బ్యాటర్లకు అనుకూలించే అత్యుత్తమ పిచ్‌లలో ఒకటిగా పేర్కొంటారు. ఈ మైదానంలో బౌండరీ సైజు చాలా చిన్నదిగా ఉండటం వల్ల పవర్ హిట్టర్లు సులువుగా సిక్సర్లు, ఫోర్లు బాదేస్తున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఎంత పెద్ద స్కోరు చేసినా, ఇక్కడ చేజింగ్ చేయడం ప్రత్యర్థి జట్టుకు పెద్ద కష్టమేమీ కాదు. భారత బ్యాటింగ్ లైనప్‌లోని అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు ఈ పిచ్ కచ్చితంగా గొప్ప వేదికగా మారనుంది.

అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లను గమనిస్తే.. 2024లో బంగ్లాదేశ్‌పై భారత్ చేసిన 221 పరుగులే ఈ గ్రౌండ్‌లో అత్యధిక స్కోరుగా నమోదు అయింది. 2022లో భారత్ నిర్దేశించిన 212 పరుగుల భారీ లక్ష్యాన్ని సౌతాఫ్రికా జట్టు విజయవంతంగా ఛేజ్ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో 5 సార్లు 200 దాటిన స్కోర్లు నమోదయ్యాయి. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఏకంగా 265 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐపీఎల్‌లో ఏకంగా 5 సార్లు 250కి పైగా స్కోర్లు నమోదు కావడం ఈ పిచ్ స్వభావాన్ని స్పష్టంగా చెబుతోంది.

టెక్నికల్ గా ఈ సిరీస్‌కు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు ఆతిథ్యం ఇస్తుంది. అయినప్పటికీ ఈ మ్యాచులు భారత్‌లోనే జరుగుతున్నాయి. చాలా కాలంగా బీసీసీఐ మౌలిక వసతులను కల్పిస్తూ ఆఫ్ఘన్ జట్టుకు అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీ మైదానాన్ని వారు తమ హోమ్ గ్రౌండ్‌గా భావిస్తుంటారు. ఈ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్ ఇప్పటివరకు రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. 2016లో ఇంగ్లాండ్ చేతిలో 15 పరుగులతో ఓటమి పాలైనప్పటికీ, 2026లో యుఏఈపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ముఖాముఖి పోటీపడటం ఇదే తొలిసారి కావడం విశేషం. పొట్టి ఫార్మాట్‌లో ఎంతో ప్రమాదకరమైన జట్లుగా పేరున్న ఇరుజట్లు ఈ పిచ్‌పై ఆడనుండటం మ్యాచ్‌పై తీవ్ర ఉత్కంఠను పెంచుతోంది. మొదటి ఓవర్ నుంచే విరుచుకుపడే వ్యూహంతో ఇరుజట్ల ఓపెనర్లు బరిలోకి దిగుతున్నారు. బౌలర్లు ఏమాత్రం చిన్న పొరపాటు చేసినా బంతి స్టాండ్స్‌లో పడటం ఖాయం.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..