Reading Time: 2 minutes
Post Office Monthly Income Scheme Mis Earn 9250 Per Month Calculation

Post Office Schemes: ఈ రోజుల్లో షేర్ మార్కెట్ ఒడిదుడుకులు, పతనాలు చూసి సామాన్యులు తమ కష్టార్జితాన్ని ఎక్కడ దాచుకోవాలో అర్థం కాక సతమతమవుతున్నారు. ఎలాంటి రిస్క్ లేకుండా, అసలుకు నయాపైసా ఢోకా రాకుండా ప్రతినెలా స్థిరమైన రాబడి రావాలని కోరుకునే వారికి పోస్టాఫీస్ ఓ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఒక్కసారి డిపాజిట్ చేసి, ప్రతి నెలా ఇంట్లో కూర్చునే ఏకంగా రూ.9,250 ఆదాయాన్ని సొంతం చేసుకునే వెసులుబాటును ‘పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్’ (Post Office MIS) కల్పిస్తోంది.

అద్భుతమైన వడ్డీ రేటు.. 5 ఏళ్ల కాలపరిమితి

ఈ పథకం యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్.. నూటికి నూరు శాతం కేంద్ర ప్రభుత్వ గ్యారెంటీ ఉండటం. ప్రైవేట్ సంస్థలు, మార్కెట్ లింక్డ్ పథకాల్లో ఉండే నష్టాల భయం ఇక్కడ అస్సలు ఉండదు. మీరు పెట్టే ప్రతి పైసా సురక్షితంగా ఉండటమే కాకుండా, నిర్ణీత గడువు వరకు ప్రభుత్వం క్రమం తప్పకుండా మీ ఖాతాలో వడ్డీ జమ చేస్తుంది. పోస్టాఫీస్ ఎంఐఎస్ పథకంలో ప్రస్తుతం వార్షికంగా 7.4 శాతం వడ్డీని కేంద్రం ఆఫర్ చేస్తోంది. ఈ పథకం కాలపరిమితి (మెచ్యూరిటీ) ఐదేళ్లు. ఇందులో మరో విశేషమేమిటంటే.. మీరు పెట్టుబడి పెట్టిన సమయంలో ఏ వడ్డీ రేటు అయితే ఖరారవుతుందో, ఆ తర్వాత ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ మీ రాబడిపై ఎలాంటి ప్రభావం పడదు. ఐదేళ్లపాటు ఒకే స్థిరమైన వడ్డీ మీ ఖాతాకు చేరుతుంది.

నెలకు రూ.9,250 ఎలా పొందాలంటే..

ఈ స్కీమ్‌లో కేవలం రూ.1,000తో కూడా ఖాతా ప్రారంభించవచ్చు. అయితే ప్రతినెలా గరిష్ట ఆదాయం పొందడానికి ప్రత్యేక పరిమితులు ఉన్నాయి:

* సింగిల్ అకౌంట్: గరిష్టంగా రూ.9 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు.

* జాయింట్ అకౌంట్: భార్యాభర్తలు లేదా కుటుంబ సభ్యులు కలిసి గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

నెలకు రూ.₹9,250 లెక్క ఇదే:
మీరు మీ పాటర్న్‌తో కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి, గరిష్ట పరిమితి అయిన రూ.15 లక్షలను ఒకేసారి డిపాజిట్ చేస్తే.. 7.4 శాతం వార్షిక వడ్డీ ప్రకారం ఏడాదికి మొత్తం రూ.1,11,000 వడ్డీ వస్తుంది. దీనిని 12 నెలలకు విభజిస్తే, నెలకు సరిగ్గా రూ.9,250 చొప్పున మీ బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ఖాతాలో పడతాయి. అంటే మీ అసలు రూ.15 లక్షలు బ్యాంకులో సేఫ్‌గా ఉంటాయి. మరోవైపు ఐదేళ్ల పాటు ప్రతినెలా ఇంటి ఖర్చుల కోసం రూ.9,250 వడ్డీ ఆదాయం అందుతుంది. కాలపరిమితి ముగిసిన తర్వాత మీ పూర్తి అసలు మొత్తం వెనక్కి వచ్చేస్తుంది. రిటైర్డ్ ఉద్యోగులకు, సీనియర్ సిటిజన్లకు, రెగ్యులర్ ఖర్చుల కోసం స్థిరమైన ఆదాయం కోరుకునే కుటుంబాలకు ఇది తిరుగులేని పెట్టుబడి మార్గంగా చెబుతున్నారు.