Reading Time: < 1 minute
Amit Shah Says Ucc Will Be Implemented In All 21 Nda Ruled States By 2029

Amit Shah: దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలుపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. 2029లోగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పాలిత 21 రాష్ట్రాల్లో యూసీసీ అమలు చేస్తామని ఆయన అన్నారు. ఆదివారం ముంబైలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మతంతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత వంటి వ్యక్తిగత అంశాలకు ఒకే రకమైన చట్టపరమైన నిబంధనలు వర్తింపచేయాలనే ఉద్దేశంతో బీజేపీ ‘‘ఉమ్మడి పౌరస్మృతి’’ని తీసుకువస్తోంది.

ఇప్పటికే పలు బీజేపీ రాష్ట్రాలు యూసీసీ చట్టాలు చేశాయి. మిగిలిన ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో కూడా దీనిని తీసుకువస్తామని అమిత్ షా ప్రకటించారు. దేశ భద్రతను ప్రస్తావిస్తూ.. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదంపై బీజేపీ ప్రభుత్వం ‘‘జీరో టాలరెన్స్’’ విధానాన్ని కొనసాగిస్తుందని చెప్పారు. అన్ని రంగాల్లో భద్రతకు అధిక ప్రధానత్య ఇస్తున్నట్లు చెప్పారు. అక్రమ వలసదారుల్ని గుర్తించి, ఏరివేస్తామని చెప్పారు.

2014కు ముందు దేశం అవినీతి, కులతత్వం, కుటుంబ రాజకీయాల వల్ల ప్రభావితమైందని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పనితీరు ఆధారంగా రాజకీయాలు కొనసాగుతున్నాయని అన్నారు. ‘ఇండియా ఫస్ట్’ అనే విధానం ద్వారా భారత విదేశాంగ, రక్షణ విధానాలకు బలమైన పునాది ఏర్పడిందని అన్నారు. ఒకప్పుడు ‘‘ఫ్రాజైల్ ఫైవ్’’ ఆర్థిక వ్యవస్థగా చూసిన భారత్‌, ఇప్పుడు ప్రపంచంలోనే టాప్-5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా చేరిందని అన్నారు. మణిపూర్‌లో ఎన్ఆర్సీ అమలుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహిస్తున్నట్లు అమిత్ షా ప్రకటించారు. మోడీ పుట్టిన రోజునే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై మాట్లాడుతూ.. భారత ప్రజస్వామ్య దేశమని, ప్రజలు నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం గౌరవిస్తుందని అమిత్ షా అన్నారు.