Reading Time: 2 minutes

టేకుకు ఆల్టర్‌‌‌‌నేట్‌‌గా వెదురు..కేరళం తరహాలో మిషన్ బంబూకు ప్రణాళికలు

Caption of Image.
  • నిర్మల్ జిల్లా ముథోల్‌‌లో మోడల్ బంబూ ఫామ్‌‌
  •     వెదురు సాగు ద్వారా ఎకరానికు రూ.లక్ష ఆదాయం వచ్చే అవకాశం 
  •     సాగుపై రైతు వేదికల ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమాలు 

నిర్మల్, వెలుగు: కేరళం రాష్ట్రంలో సక్సెస్ అయిన మిషన్ బంబూ తరహాలో రాష్ట్రంలో కూడా వెదురు సాగును ప్రోత్సహించి ఆ పంట సాగు విస్తీ ర్ణాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం పంట చేను గట్లపైన, ఖాళీ స్థలాల్లో పెంచుతున్న టేకు చెట్లకు ప్రత్యామ్నాయంగా వెదురు పెంపకానికి ప్రాధాన్యమివ్వనున్నారు. అలాగే ప్రస్తుతం వరి, పత్తి, సోయాబీన్ తదితర పంటలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్‌‌‌‌తోపాటు వెదురు సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనికోసం వెదురు పంట సాగును, ఆ పంటపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించే బాధ్యతను హార్టికల్చర్ శాఖకు అప్పజెప్పింది. 

దీనిలో భాగంగానే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ యాక్షన్ ప్లాన్ చేపట్టింది. నిర్మల్ జిల్లా ముథోల్‌‌లో 20 ఎకరాల్లో మోడల్‌‌ బంబూ ఫామ్‌‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫామ్‌‌లో బాంబుజా తుల్డా రకం, బాంబుజా బాల్కోవా, డెండ్రో కళామస్ లాటరీ ఫోరస్ రకం, డెండ్రో కళామస్ బ్రాండ్సి రకం మొక్కలను పెంచుతున్నారు. ఈ మొక్కలను హార్టికల్చర్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆసక్తి ఉన్న రైతులకు పంపిణీ చేయనున్నారు. 

టేకుకు ప్రత్యామ్నాయంగా..

టేకు చెట్ల పెంపకానికి ప్రత్యామ్నాయంగా వెదురును పంట చేలల్లో సాగు చేసేలా హార్టికల్చర్ కార్యాచరణ చేపట్టింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో బంబూకు భారీగానే డిమాండ్ ఉంది. ఈ చెట్ల పెంపకానికి ఎకరాకు రూ.20 వేల నుంచి 25 వేలు ఖర్చు కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే పంట చేతికి వచ్చాక ఎకరానికి రూ.లక్షకు పైగా ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు. వెదురుచెట్టు 50 ఏళ్ల వరకు సజీవంగా ఉంటుందని ఈ పంట సాగు చేస్తే రైతులకు మంచి లాభాలు వస్తాయంటున్నారు. వెదురు పంటకు చీడపీడల సమస్య ఉండదని అగ్ని ప్రమాదాల నుంచి రక్షించుకుంటే సరిపోతుందని అధికారులు పేర్కొంటున్నారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం వెదురుకు డిమాండ్ ఉందని అధికారులు చెబుతున్నారు. 

రైతులకు రాయితీలు

జిల్లాలో వెదురు సాగును ప్రోత్సహించేందుకు రైతు వేదికల ద్వారా హార్టికల్చర్ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ పంటను సాగు చేసే రైతులకు పెద్ద ఎత్తున రాయితీలను కూడా ప్రభుత్వం ఇస్తోంది. ప్రతి ఎకరానికి 160 మొక్కలను ప్రభుత్వం రైతులకు అందజేస్తుంది. మొదటి సంవత్సరం ఒక మొక్కకు రూ.90 రాయితీగా ఇవ్వనున్నారు. ఇందులో నుంచి రూ.50 ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌‌కు అందజేయాల్సి ఉంటుంది. మిగతా రూ.45 రైతులకు నేరుగా అందిస్తారు. రెండో ఏడాది మొక్కకు రూ.60 చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తారు. ఈ ప్రక్రియ అంతా హార్టికల్చర్ శాఖ ద్వారా ఆన్‌‌లైన్‌‌లో పారదర్శకంగా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. 

రైతులకు అవగాహన కల్పిస్తున్నాం

వెదురు పెంపకంపై రైతులకు మండలాల వారీగా అవగాహన కల్పిస్తున్నాం. ప్రస్తుతం ముథోల్‌‌ ఫామ్‌‌లో నాలుగు రకాల వెదురు మొక్కలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ఖర్చుతో సాగయ్యే వెదురు ద్వారా రైతులకు మంచి లాభాలు వస్తాయి. ప్రత్యామ్నాయ పంటల సాగులో భాగంగా వెదురుకు కూడా ప్రాధాన్యమివ్వాలని రైతులకు సూచిస్తున్నాం. సాగులో మెలకువలతో పాటు మార్కెటింగ్, వివిధ రకాల అనుబంధ ఉత్పత్తుల తయారీ లాంటి అంశాలపై రైతులకు శిక్షణ కూడా ఇస్తాం.
– బీవీ రమణ, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్, నిర్మల్.

©️ VIL Media Pvt Ltd.